రాముడు కాదు రాక్షసుడు | man kills uncle in elikatta | Sakshi
Sakshi News home page

రాముడు కాదు రాక్షసుడు

Published Thu, Dec 15 2016 7:47 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

రాముడు కాదు రాక్షసుడు - Sakshi

రాముడు కాదు రాక్షసుడు

మామను హతమార్చిన అల్లుడు
ఇప్పటికే నలుగురిని చంపిన కిరాతకుడు


షాద్‌నగర్‌ క్రైం: చిన్న విషయాన్నే మనసులో పెట్టుకుని పిల్లనిచ్చిన మామను దారుణంగా హతమార్చిన సంఘటన బుధవారం ఫరూఖ్‌నగర్‌ మండలం ఎలికట్ట గ్రామంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఎలికట్ట గ్రామానికి చెందిన రాములుకు 20 ఏళ్ల క్రితం బాలానగర్‌ మండలం రంగారెడ్డి గూడ గ్రామానికి చెందిన పార్వతమ్మతో వివాహం జరిగింది. కొంతకాలం భార్యతో సఖ్యతగానే ఉన్న రాములు ఓ రాత్రి ఆమెపై కిరోసిన్‌ పోసి నిప్పంటించి హత్య చేశాడు.  ఆ తర్వాత రెండే ళ్లకు కొందుర్గుకు చెందిన స్వప్నను పెళ్లి చేసుకున్న అతను కొద్ది రోజులకే అతను భార్యపై అనుమానం పెంచుకుని భార్య స్వప్నతో పాటు తన తండ్రి పులాయిల అడివయ్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు.

ఈ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన రాములు మూడో వివాహం చేసుకునేందుకు సిద్దమయ్యాడు. కిషన్‌నగర్‌  గ్రామానికి చెందిన మంజులను పెళ్లి చేసుకోవాలని ప్రదిపాదన పంపాడు. అయితే రాములు నేర చరిత్ర తెలుసుకున్న మంజుల బంధువులు పెళ్లికి అంగీకరించకపోవడంతో గ్రామంలో   తన వాటాకు వచ్చిన 20 గుంటల పొలాన్ని మంజుల పేరుపై రిజిష్టర్‌ చేసి వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు వారి కాపురం సజావుగానే  సాగింది. అయితే భార్యను మభ్యపెట్టి ఆమె పేరున ఉన్న  భూమిని విక్రయించాడు. ఈ విషయంలో మంజుల కుటుంబ సభ్యులు, రాములు మధ్య గొడవ జరగడంతో ఆరు నెలల క్రితం మంజుల తన పుట్టింటికి వెళ్లింది. ఈ నేపథ్యంలో సోమవారం మంజుల బంధువులు రాములుకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, మాటా మాటా పెరగడంతో గొడవ జరిగింది.


దీంతో మంజుల తండ్రి పోచయ్యపై కోపం పెంచుకున్న రాములు అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. సోమవారం రాత్రి మద్యం తాగేందుకు పోచయ్య(55)ను వెంటతీసుకెళ్లి గ్రామ శివార్లతో బండరాయితో మోది హతమార్చాడు. గ్రామ శివారులో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన కుటుంబ సభ్యులు హతుడు పోచయ్యగా గుర్తించారు. ఏసీపీ శ్రీనివాస్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతుని భార్య పోచమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement