
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి
గూడూరు : పట్టణంలోని గ్రామ సేవకుల భవనం సమీపం ఓ దుకాణం మెట్లపై అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడాన్ని ఆదివారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్సై సుధాకర్ సమాచారం మేరకు.. మేరకు గూడూరు రూరల్ పరిధిలోని తిలక్‌నగర్‌కు చెందిన పద్మనాభరెడ్డి (45)కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలంగా పద్మనాభరెడ్డి అనారోగ్యంలో బాధపడుతున్నాడు. ఏం జరిగిందో కాని, ఓ దుకాణ మెట్లపై బోర్లా పడి మృతి చెందాడు. మృతుడి తలపై నుంచి రక్తం కారి ఉంది. దీంతో ఆ ప్రాంతం రక్తసిక్తమైంది. మృతుడి పక్కనే రెండు కవర్లలో పండ్లు, ఇతర సామగ్రి ఉంది. బజారుకు వచ్చి తిరిగి ఇంటికెళ్లే క్రమంలో అక్కడ పడిపోయి రక్తం కక్కుకుని మృతి చెందాడా.. లేక ఎవరైనా దాడి చేసి హతమార్చారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.