‘మణప్పురం’లో ఇంటి దొంగలు
ఖాతాదారుల బంగారం మాయం
నకిలీ వివరాలతో తాకట్టు సొత్తు విడిపించి అమ్మకం
కార్యాలయానికి క్యూ కడుతున్న ఖాతాదారులు
సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరం నగరంలోని కోరుకొండ రోడ్డులో రాజా థియేటర్ ఎదురుగా ఉన్న మణప్పరం గోల్డ్ లోన్ కార్యాయలంలో ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారం మాయమవుతోంది. నకిలీ వివరాలతో బంగారాన్ని విడిపించుకుని సంస్థ ఉద్యోగులు అమ్మేసుకుంటున్న వ్యవహారం బయటపడడంతో ఆ బ్రాంచ్‌లో ఖాతాదారులుగా ఉన్న వారిలో ఆందోళన మొదలైంది. తన బంగారాన్ని సిబ్బంది మాయం చేశారని సోమవారం కొంతమూరు గ్రామం అఫిషియల్ కాలనీకి చెందిన సాకా సుబ్రహ్మణ్యం మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంస్థ సిబ్బంది అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. సంస్థ ఉద్యోగులే ఈ పని చేశారని సుబ్రహ్మణ్యం తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మూడో తేదీన ఇంటి అవసరాల కోసం సుబ్రహ్మణ్యం 94 గ్రాముల బంగారాన్ని కోరుకొండ రోడ్డులోని మణప్పరం గోల్డ్ లోన్ కార్యాలయంలో తాకట్టు పెట్టి రూ.1,88,900 రుణం తీసుకున్నారు. మూడు నెలలు గడువు ముగుస్తుండడంతో సోమవారం బంగారం విడిపించుకు వెళదామని వచ్చారు. వివరాలు చెప్పి నగదు కట్టేందుకు ఉపక్రమించడంతో మీరు మే 3నే బంగారం విడిపించుకు వెళ్లారని మేనేజర్ చెప్పడంతో సుబ్రహ్మణ్యం దంపతులు అవాక్కయ్యారు. తాను మూడు నెలల తర్వాత ఇప్పుడే వస్తున్నానని, విడిపించుకున్న వ్యక్తి ఫొటో ఇతర వివరాలు అడగడంతో అసలు వ్యవహారం బయటపడింది. తాను తాకట్టు పెట్టిన బంగారం వేరే ఎవరో వ్యక్తికి ఎలా ఇస్తారని సుబ్రహ్మణ్యం ప్రశ్నించడంతో మేనేజర్ నీళ్లు నమిలారు. రెండు రోజుల్లో మీ విషయం సెటిల్ చేస్తామని మేనేజర్ చెప్పడంతో ఆ విషయం కంపెనీ తరఫున రాయించి ఇవ్వాలని బాధితుడు సుబ్రహ్మణ్యం అడిగారు. అలా ఇవ్వడం కుదరదని మేనేజర్ చెప్పడంతో కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. దీంతో తనకు జరిగిన అన్యాయంపై సుబ్రహ్మణ్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇంటి దొంగలే ...
బంగారం తాకట్టు పెట్టి రుణం ఇచ్చే సమయంలో సిబ్బంది రుణగ్రహీత వివరాలు, కంప్యూటర్‌లో అప్పటికప్పుడు ఫొటో తీసుకోవడం, సంతకం వంటి ప్రక్రియ పూర్తి చేస్తారు. అదే విధంగా రుణం చెల్లించి బంగారం విడిపించుకునే సమయంలో కూడా సంబంధిత రుణగ్రహీత వివరాలు, కంప్యూటరైజ్డ్ ఫొటో, సంతకం తీసుకుని ఇస్తారు. కానీ సుబ్రహ్మణ్యం విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా జరిగింది. ఎవరో వ్యక్తి ఫొటో పెట్టి 94 గ్రామల బంగారం విడిపించారు. ఈ వ్యవహారంలో బ్రాంచ్ మేనేజర్, పై స్థాయి ఉద్యోగులు ఉన్నారని సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నామని మూడో పట్టణ ఇన్‌స్పెక్టర్ మారుతీరావు తెలిపారు.