పనిమనిషిగా చేరి చోరీ
మత్తుమందు కలిపి నగలు అపహరణ
ఎట్టకేలకు నిందితుల అరెస్టు
రాజమహేంద్రవరం క్రైం : ఇంట్లో పని మనిషిగా చేరి కాఫీలో మత్తు మాత్రలు వేసి వారు స్పృహ కోల్పోయాక బంగారు నగలతో ఉడాయిస్తున్న నిందితులను త్రీటౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. సోమవారం త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కులశేఖర్ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం రాజమహేంద్రవరం కోర్లమ్మపేట ఒకటో వీధికి చెందిన చెన్నుపాటి రవి శంకర్ ఇంట్లో పనిచేసేందుకు 15 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రానికి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం, పాములపల్లికి చెందిన పొడుతూరి రాధ (ప్రస్తుతం రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐ వద్ద ఉంటోంది) పని మనిషిగా చేరింది. 15 రోజులుగా ఇంట్లో పనులు చేస్తు అందరికీ చేరువైంది. అదే ఇంట్లో పై పోర్షన్‌లో ఉంటున్న రవిశంకర్ తల్లి చెన్నుపాటి సత్యనారాయణకు కాఫీలో మత్తుమాత్రలు కలిపి ఇచ్చింది. ఆమె నిద్రలోకి జారుకున్న తరువాత ఆమె శరీరంపై ఉన్న ఆరు కాసుల గొలుసు, మూడు కాసుల పగడాల దండ తీసుకొని పరారైందని తెలిపారు. అప్పటి నుంచి రాధ కనిపించకపోవడంతో బాధితులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన త్రీటౌన్ ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు, సెంట్రల్ జోన్ డీఎస్పీ ఆదేశాల మేరకు పొడుతూర్తి రాధ, ఆమెకు సహకరించిన ఖమ్మం జిల్లా చర్ల మండలం కుదునూరుకు చెందిన గడిదేశే సునీల్ బాబులను సోమవారం రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి తొమ్మిది కాసుల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను త్వరితగతిన అరెస్ట్ చేసినందుకు సెంట్రల్ జోన్ డీఎస్పీ జె.కులశేఖర్ త్రీటౌన్ సీఐ ముక్తేశ్వరరావును, ఎస్సై వెంకటేశ్వరరావును, సిబ్బందిని అభినందించారు. నిందితులను మూడో అదనపు ఏజేఎఫ్‌సీఎం కోర్టులో హాజరు పరిచారు.