రైతుల పేరుతో ‘తమ్ముళ్ల’కు దుకాణాల కేటాయింపు
అక్రమాలను ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ నేతలపై దౌర్జన్యం
తమకు సంబంధం లేదంటూ ఎస్టేట్ అధికారి,
తహశీల్దారుల పలాయనమంత్రం
జరిగిన దౌర్జన్యంపై ఫిర్యాదు చేసేందుకూ అడ్డంకులు
రైతులకు న్యాయం జరిగే వరకూ పోరు ఆగదన్న వైఎస్సార్ సీపీ నేత లీలాకృష్ణ
మండపేట : మండపేట రైతుబజారు సాక్షిగా తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. అక్రమాలపై విచారణకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ, పార్టీశ్రేణులపై దాడికి యత్నించారు. వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటూ రైతుబజారు సిబ్బందిని బయటకు పంపేశారు. కార్యాలయం లోపలి నుంచి బయటకు వస్తున్న వారిపై కవ్వింపు చర్యలతో గలాటా సృష్టించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారి మధ్య జరిగిన తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన వారిని లోపలికి పోనీకుండా గేటుబయట బైఠాయించి అధికారపార్టీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. స్థానిక రైతుబజారులో రైతులకు కాకుండా అధికారపార్టీ నేతలకు షాపులను కట్టబెట్టడంపై విచారణ జరపాలని వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఎస్టేట్ అధికారి భాస్కర్‌కు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం వస్తానన్న ఈఓ హామీ మేరకు వైఎస్సార్ సీపీ నేతలు అక్కడకు వెళ్లగా టీడీపీ నాయకులు వీరంగం సృష్టించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం విచారణకు వస్తున్నట్టు ఈఓ భాస్కర్ ఇచ్చిన సమాచారం మేరకు లీలాకృష్ణ, పార్టీ నేతలతో కలిసి రైతుబజారు వద్దకు చేరుకున్నారు. అప్పటికే అధికారపార్టీ నేతలు అక్కడకు చేరుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దూలం వెంకన్నబాబు, పార్టీ నాయకులు పడాల సతీష్ తదితరులు తమ వాదనలు వినేందుకు మార్కెట్‌గేటు వద్దకు రావాలని కోరారు. అందుకు నిరాకరించిన ఈఓ కేవలం ఆరుగురు మాత్రమే కార్యాలయంలోకి రావాలని సూచించారు. లీలాకృష్ణ, వెంకన్నబాబులతో పాటు మరోనలుగురు కార్యాలయంలోకి వచ్చి తమ పరిశీలనలో వెలుగుచూసిన అంశాలు గూర్చి ఈఓ భాస్కర్‌కు వివరించారు. అలాగే కూరగాయలు పండిస్తున్నట్టుగా తప్పుడు రికార్డులు సృష్టించారని, ఏదో ఒక రైతుకు చెందిన కూరగాయల పంటను చూపించాలని లీలాకృష్ణ ఈఓను కోరారు. తహసీల్దార్ ఎం.వెంకటేశ్వర్లుకు ఈ విషయమై ఫిర్యాదు చేస్తే తమకు సంబంధం లేదు, మార్కెటింగ్ అధికారులదే బాధ్యతని చెబుతున్నారని ఈఓకు లీలాకృష్ణ వివరించారు.
ఎవరికి వారే తప్పించుకునే యత్నం..
వీఆర్‌ఓ, తహశీల్దార్, ఉద్యానవనశాఖ అధికారులు ఇచ్చిన ధృవీకరణ పత్రాల మేరకే తాము రైతులుగా గుర్తించి దుకాణాలు కేటాయిస్తామని, విచారణ చేసే అధికారం తనకు లేదని ఈఓ భాస్కర్ తెలిపారు. ఇదే విషయాన్ని లీలాకృష్ణ ఫోన్‌లో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఈఓ భాస్కర్లతో పరస్పరం మాట్లాడించారు. రైతుల గుర్తింపు తమకు సంబంధం లేదని ఈఓ అనగా, మాకూ సంబంధం లేదని తహసీల్దార్ తప్పించుకునే యత్నం చేశారు.
తమ్ముళ్ల వీరంగం
అప్పటికే బయట ఉన్న అధికారపార్టీ నేతలు కొందరు లోపలికి చొరబడి ఎవరికీ సమాధానం చెప్పాల్సిన పనిలేదని రైతుబజారు సిబ్బందిని బయటకు పంపేశారు. లోపలి నుంచి బయటకు వస్తున్న లీలాకృష్ణ, పార్టీ నేతలపై వారు దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాట, వాగ్వాదాలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీఎం బందోబస్తు నేపథ్యం లో ఒక హెచ్‌సీ, ఒక పీసీ మాత్రమే రైతుబజారుకు వచ్చి లీలాకృష్ణతో చర్చించి రైతుబజారు నుంచి బయటకు పంపేశారు. దీంతో వారు అర్హులైన రైతులకు దుకాణాలు అప్పగించాలని డిమాండ్ చేస్తూ స్థానిక కరాచీ సెంటర్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం అధికారపార్టీ నేతల తీరుపై ఫిర్యాదు చేసేం దుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లగా అప్పటికే అక్కడకు చేరుకున్న అధికారపార్టీ నేతలు స్టేషన్ వద్ద లీలాకృష్ణ తదితరులను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. హెచ్‌సీ సత్యనారాయణ వారి తో చర్చించి అందరిని స్టేషన్‌లోకి పంపా రు. రామచంద్రపురం అర్బన్ ఎస్‌ఐ శ్రీనివాసరావు స్టేషన్‌కు చేరుకుని ఇరువర్గాలతో చర్చించారు. కొద్దిసేపటికి సీఐ హ్యాపీకృపావందనం స్టేషన్‌కు వచ్చి ఇరువర్గాలతో చర్చించి పరిస్థితిని అదుపుచేశారు. తమపై దాడికి పాల్ప డ్డారంటూ ఇరువర్గాలూ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు.
అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు దౌర్జన్యం
రైతుబజారు షాపుల కేటాయింపులో అక్రమాలను కప్పిపుచ్చేందుకు అధికారపార్టీ నేతలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని లీలాకృష్ణ విమర్శించారు. తన వారికి మేలు చేసుకునేందుకు స్థానిక ఎమ్మెల్యే రైతులకు అన్యాయం చేశారన్నారు. అసలైన రైతులకు మేలు జరిగే వరకు పోరు ఆపబోమన్నారు. బయటి రైతుబజార్లతో పోలిస్తే మండపేట రైతుబజారులో కేజీకి రూ.నాలుగు వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్నారు. అసలైన రైతులు ఉంటే ఈ పరిస్థితి ఉండేదికాదని లీలాకృష్ణ పేర్కొన్నారు. ఎంపీటీసీ సభ్యుడు అన్నందేవుల చంద్రరావు, పార్టీ నాయకులు పడాల కమాలారెడ్డి, పడాల సతీష్, ఎస్.కోటేశ్వరరావు, సరాకుల అబ్బులు, పొలమాల సత్తిబాబు, మేడపాటి సురేష్‌రెడ్డి, తిరుశూల శ్రీను పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ శ్రేణులపై కేసుల బనాయింపు
రైతుబజారులో అక్రమాలపై విచారణ కోరిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నాయకులపై అక్రమ కేసులు నమోదయ్యాయి. పట్టణంలోని రైతుబజారులో సోమవారం రాత్రి వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ వేగుళ్ల లీలాకృష్ణ ఆకస్మిక తనీఖీ నిర్వహించిన విషయం విదితమే. ఈ సందర్భంగా అధికారపార్టీ నేతలకు షాపులు కట్టబెట్టగా కొందరు బినామీల పేరుతో నిర్వహిస్తుండగా, మరికొందరు అద్దెకు ఇచ్చుకున్నట్టు తనిఖీల్లో వెలుగు చూసింది. ఈ విషయమై విచారణ నిర్వహించి అసలు రైతులకు మేలు చేయాలని అప్పటికప్పుడు ఉన్నతాధికారులకు లీలాకృష్ణ ఫిర్యాదుచేశారు. విధుల్లో ఉన్న ఈఓ బి.సతీష్‌ను వివరణ కోరగా తనకు తెలీదని బదులిచ్చాడు. కాగా లీలాకృష్ణ, మరికొందరు వచ్చి తన విధులకు ఆటంకం కలిగించినట్టు ఈఓ బి.సతీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ పోలీస్ కేసు నమోదైంది. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు రమణమ్మ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదుచేసినట్టు పట్టణ హెచ్‌సీ సత్యనారాయణ తెలిపారు.