పోలీసులకు చిక్కిన నిందితుడు
చోరీ సొత్తు స్వాధీనం
మండపేట : మండపేటలో జరిగిన చోరీ కేసులో నిందితుడు పోలీసులకు చిక్కాడు. స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఏఆర్ దామోదర్ కేసు వివరాలను వివరించారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే వీవీఎస్‌ఎస్ చౌదరి నివాసంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వియ్యంకుడు చినబాబు నివసిస్తున్న గదిలో చోరీ జరిగిందన్నారు. అర్ధరాత్రి సమయంలో చినబాబు సతీమణి సుజాతమ్మ బాత్రూమ్‌కు వెళ్లిన సమయంలో పట్టణంలోని మఠం వీధికి చెందిన పెదగాడి వీరవెంకట వీరేంద్ర (20) ఇంట్లోకి ప్రవేశించి రూ.57 లక్షల విలువైన ఆభరణాలు, రూ.52,700 నగదు చోరీ చేశాడన్నారు. దీనికి అదే ఇంటిలో పనిచేస్తున్న దేవుడు అనే వ్యక్తి సహకరించినట్టు అనుమానాలున్నాయన్నారు. వీరేంద్ర హైదరాబాద్‌లో ఉంటూ ఇక్కడకు వచ్చి ఈ నేరానికి పాల్పడ్డారన్నారు. గతంలోను ఇతడికి నేరచరిత్ర ఉందని, తల్లి గొలుసు, మేనమామకు చెందిన బంగారాన్ని చోరీ చేసినట్టు ఏఎస్పీ దామోదర్ వివరించారు. నిందితుడు వ్యసనాలకు బానిసై పథకం ప్రకారం ఈ చోరీకి పాల్పడ్డాడన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లు కూడా చేసేవాడని తమ వద్ద సమాచారం ఉందన్నారు. ఈ చోరీ చేసిన ఆభరణాల్లో రెండు గాజులను స్థానికంగా ఉన్న బంగారు షాపు వద్దకు అమ్మడానికి తీసుకురాగా అనుమానం వచ్చి షాపు యజమానులు ఇచ్చిన సమాచారం మేరకు చాకచక్యంగా డీఎస్పీ మురళీకృష్ణ నిందితుడిని అదుపులోకి తీసుకున్నారన్నారు. అక్కడి నుంచి అతడి ఇంటికి వెళ్లి అతను ఇంటిలో దాచిన బ్యాగును గుర్తించగా అందులో బంగారు ఆభరణాలు, నగదు లభ్యమయ్యాయన్నారు. డీఎస్పీ మురళీకృష్ణ చాకచక్యంగా నిందితుడిని పట్టుకున్నారని ఏఎస్పీ దామోదర్ ప్రశంసించారు. ఐదుగురు పోలీస్ అధికారులతో ఐదు బృందాలను ఏర్పాటు చేయడంతో పాటు పట్టణంలో వ్యూహాత్మకంగా ఒక బృందాన్ని రంగంలోకి దించారని వివరించారు. ఎప్పటికప్పుడు స్వయంగా కేసును పర్యవేక్షించడం వల్ల నిందితున్ని త్వరగా పట్టుకోగలిగామన్నారు. ఈ కేసులో సీఐలు గీతా రామకృష్ణ, వి. పుల్లారావు, హ్యాపీ కృపావందనం, ఎస్‌ఐలు ఎండీ నసీరుల్లా, పెద్దిరాజు, రామకృష్ణ తదితరులకు ఎస్పీ రివార్డు ప్రకటించారని వివరించారు. నిందితున్ని ఆలమూరు కోర్టులో హాజరు పర్చనున్నట్టు ఏఎస్పీ దామోధర్ తెలిపారు.