అంతా ఓపెన్! | mass copying in open tenth examinations | Sakshi
Sakshi News home page

అంతా ఓపెన్!

Published Tue, Mar 29 2016 3:10 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

భద్రాచలం:   పుస్తకం పక్కన   పెట్టుకుని పరీక్షకు   హాజరైన విద్యార్థి

భద్రాచలం: పుస్తకం పక్కన పెట్టుకుని పరీక్షకు హాజరైన విద్యార్థి

ఇన్విజిలేటర్లే సూత్రధారులు
ఒక్కోపేపర్‌కు రూ.వెయ్యి వసూలు
డీఈఓ హెచ్చరించినా ఆగని మాస్‌కాపీయింగ్
కొన్నిచోట్ల ఒకరికి బదులు మరొకరు రాసిన పరీక్ష

అధికారులు దృష్టి పెట్టినా.. ఉన్నతాధికారులు హెచ్చరించినా.. సార్వత్రిక పరీక్షలు మళ్లీ ‘ఓపెన్’గానే ప్రారంభమయ్యాయి. మాస్ కాపీయింగ్ యథాతథంగా కొనసాగింది. ఎప్పటిలాగే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాశారు. పరీక్షల తొలిరోజు సోమవారం ఇలా 8 మందిని పట్టుకున్నారు. తండ్రికి బదులు కొడుకు.. అన్నకు బదులు తమ్ముడు..స్నేహితుని కోసం మరొకరు... పరీక్ష రాస్తూ దొరికిపోయారు. గ్యారంటీ పాస్ పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.5వేలు వసూలు చేసిన ఓపెన్ స్కూల్ నిర్వాహకులు పరీక్ష కేంద్రాల్లోకి పుస్తకాలతో అడుగుపెట్టడం.. ఇన్విజిలేటర్లతో బేరసారాలకు దిగడం చర్చనీయాంశమైంది. తొలిరోజు ఓపెన్ టెన్త్ పరీక్షకు 268 మంది, ఓపెన్ ఇంటర్ పరీక్షకు 361 మంది గైర్హాజరయ్యారు.

 ఖమ్మం/భద్రాచలం :  ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ సోమవారం ప్రారంభమైన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షల్లో ఓపెన్‌గానే మాస్‌కాపీయింగ్‌కు పాల్పడినట్లు సమాచారం. జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాల్లో ఉన్న పరీక్షా కేంద్రాల వరకు అధికారులే మాస్‌కాపీయింగ్‌ను ప్రోత్సహించారని తెలుస్తోంది. పరీక్షలు ప్రారంభమైన తొలిరోజునే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు గుర్తించిన 8 మందిని పోలీస్, ఇతర స్క్వాడ్ అధికారులు పట్టుకోవడమే ఇందుకు నిదర్శనం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రైవేట్ పాఠశాలలకు సెంటర్లు ఇవ్వడం, అక్కడ డ్యూటీ చేస్తున్న అధికారులు మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించడంతో తమ పాఠశాలలకు చెడ్డ పేరు వస్తోందని, ఆడ్మిషన్లు ప్రారంభమవుతున్న సమయంలో ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోందని యాజమాన్యం తలలు పట్టుకుంటోంది.

 ఓపెన్ ఇంటర్, టెన్త్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ అంతా ఓపెన్‌గానే నడుస్తోంది. ఇన్విజిలేటర్లే సూత్రధారులుగా మారి, ఒక్కో పేపర్‌కు రూ.వెయ్యి వసూలు చేసి దర్జాగా కాపీయింగ్‌కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సోమవారం నుంచి ప్రారంభమైన పరీక్షల కోసం భద్రాచలంలో ఐదు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షకు సంబంధించి 359 మంది ఫీజు చెల్లించగా, 299 మంది హాజరయ్యారని ఎంఈఓ రంగయ్య తెలిపారు. పదో తరగతిలో 637 మందికి గాను 563 మంది హాజరయ్యారు. రెండు కేంద్రాలను ‘సాక్షి’ పరిశీలించగా అందులో ప్రైవేట్ వ్యక్తులు తిరుగుతూ మంతనాలు చేయడం దర్శనమిచ్చింది. ఓ గదిలో విద్యార్థులందరినీ ఒకేచోట కూర్చోబెట్టి పరీక్ష రాయించినట్లుగా తెలుస్తోంది.

విద్యార్థులు బెంచీలపైనే పుస్తకాలు పెట్టుకుని పరీక్షలు రాసినప్పటికీ ఇన్విజిలేటర్లు ఏమాత్రం పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. పరీక్ష ప్రారంభ సమయానికి 5 నిమిషాల తరువాత అనుమతించకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రైవేటు కళాశాలలు, పరీక్ష ఫీజులు చెల్లించిన సెంటర్ల వారితో ముందస్తు ఒప్పందాల నేపథ్యంలో అరగంట లేటుగా వచ్చినవారిని కూడా అనుమతించినట్లు సమాచారం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఆదేశించినప్పటికీ నిర్వాహకుల్లో మార్పు లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. సమాచారం అందుకున్న ఎస్సై కరుణాకర్ సిబ్బందితో సెంటర్ల వద్ద బందోబస్తు నిర్వహించారు. మంగళవారం నుంచి కేంద్రాల వద్ద బందోబస్తు పెంచుతామని ఆయన ‘సాక్షి’కి వివరించారు. కాగా, ఒకరిపై మాల్‌ప్రాక్టీస్ కేసు నమోదు చేసినట్లు ఎంఈఓ రంగయ్య చెప్పారు.

 తండ్రికి బదులు తనయుడు
ఇల్లెందు: పట్టణంలో సోమవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో తండ్రికి బదులుగా కుమారుడు పరీక్ష రాస్తూ ఎస్సైకి పట్టుబడ్డాడు. పినపాక నియోజకవర్గంలోని గుండాల మండలానికి చెందిన వీఆర్‌ఏ మేడిపల్లి జానయ్య ఇల్లెందులోని ఓ పరీక్ష కేంద్రంలో పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే, జానయ్యకు బదులుగా ఆయన కుమారుడు చిరంజీవి పరీక్ష రాస్తున్నాడు. ఈ సమయంలో ఎస్సై సతీష్‌కుమార్ తనిఖీకి వచ్చి హాల్ టికెట్లు పరిశీలించారు. చిరంజీవి హాల్‌టికెట్‌పై జానయ్య పేరు ఉండగా అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు విషయం బయటికి వచ్చింది. తండ్రీకుమారులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఓపెన్ టెన్త్‌లో ఓ విద్యార్థి మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతుండగా ఉపవిద్యాశాఖ అధికారి బస్వారావు డిబార్ చేశారు. 

 ఒకరికి బదులు మరొకరు..
ఖమ్మం అర్బన్ : నగరంలోని మమత వైద్యశాల రోడ్డులోని ఓపెన్ టెన్త్ పరీక్ష సెంటర్లో సోమవారం ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. వెంటనే అతడిని కేంద్రం సూపరింటెండెంట్ రుక్మిందరావు అర్బన్ పోలీసులకు అప్పగించారు. ఆ సెంటర్లో హుస్సేన్ అనే విద్యార్థి పరీక్ష రాస్తుండగా అతడి హాల్ టికెట్‌పై అతడి తండ్రి ఫొటో ఉంది. దీంతో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement