సాహస వీరులు.. మత్స్యకారులు
- 13 మంది ప్రాణాలను కాపాడిన తీరు..
నేలకొండపల్లి/ తిరుమలాయపాలెం: ఇంకాసేపట్లో తెల్లవారుతుంది. అప్పుడే మత్స్యకారులు వలలు పట్టుకొని చేపలవేటకు బయల్దేరారు. చిమ్మచీకట్లు అలుముకొని ఉన్నాయి. నాయకన్‌గూడెం వంతెనపై రెండు బస్సులు ప్రమాదానికి గురై కనిపించాయి. మత్స్యకారులు అక్కడికి వెళ్లారు. ఎవరికీ హాని జరగలేదని నిర్దారించుకొని చేపల వేట కోసం వెనుదిరిగారు. అంతలోనే హైదరాబాద్ మియాపూర్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఒక్కసారిగా వచ్చి కాల్వలో పడిపోవడంతో పెద్దశబ్దం వచ్చింది. వెంటనే మత్స్యకారులు వెనుదిరిగి వచ్చారు. క్షతగాత్రులను కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేసి టార్చిలైట్ల వెలుగులో కాల్వలో వెతకడం ప్రారంభించారు. తీవ్రగాయాల పాలైన 13 మందిని బయటకు తీసి వైద్యం కోసం తరలించి ప్రాణాలు కాపాడారు. క్షతగాత్రులను బయటకు తీసేందుకు బస్సు అద్దాలను పగులగొట్టే ప్రయత్నంలో మత్స్యకారులకూ గాయాలయ్యాయి. మత్స్యకారులు లేకపోతే మృతుల సంఖ్య మరింత పెరిగేదని స్థానికులు తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారిని కూడా బయటకు తీసేందుకు మత్స్యకారులు తీవ్రంగా శ్రమించారు. మత్స్యకారులను వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం చినరాజప్ప అభినందించారు. మత్స్యకారులు కాపాడటం వల్లనే తమ ప్రాణాలు దక్కాయని పలువురు క్షతగాత్రులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.