విలాసాలకు బానిసై..
చోరీ బాట పట్టిన ఎంబీఏ విద్యార్థి
రూ.15 లక్షల చోరీ సొత్తు స్వాధీనం
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ) : ఆ యువకుడు ఎంబీఏ చదువుతున్నాడు. విలాసాలకు, చెడు వ్యసనాలకు లోనై అతడు.. అక్రమమార్గంలో డబ్బు సంపాదించేందుకు చోరీల బాట çపట్టాడు. ఐదేళ్ల కాలంలో కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలో సుమారు 20 చోరీలకు పాల్పడ్డాడు. తాళం వేసి ఉన్న ఇళ్లు, సింగిల్‌గా ఉంటున్న గృహాలను ఎంచుకుని కటింగ్ మిషన్‌తో తలుపులను కట్ చేసి నగదు, బంగారు ఆభరణాలను అపహరించుకుపోతున్న అతడిని ఇంద్రపాలెం పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. అతడి నుంచి సుమారు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, కారు స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్‌స్టేషన్లో ఆదివారం కాకినాడ రూరల్ సర్కిల్ సీఐ వి.పవన్‌కిషోర్ ఈ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. పెదపూడి మండలం అచ్చుతాపురత్రయానికి చెందిన 23 ఏళ్ల అడబాల వెంకటశివ కాకినాడకు చెందిన ఓ కార్పొరేట్ కళాశాల్లో ఎంబీఏ చదువుతున్నాడు. 2016 ఆగస్టు నుంచి ఇంద్రపాలెంలో 4, పెదపూడి–2, కాకినాడ టూటౌన్–2, సర్పవరం–3 పోలీస్‌స్టేషన్ల పరిధిలో మొత్తం 11 చోరీలకు పాల్పడ్డాడు. ఇతడు అద్దెకు తెచ్చుకున్న కారులో పగలు, రాత్రి సమయాల్లో జనావాసం లేని ఇళ్లు, ఇంటికి తాళం వేసి ఉన్న ఇళ్లు, సింగిల్‌గా విశ్రాంత ఉద్యోగుల గృహాల్లో చోరీలకు పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు కాకినాడ కోకిల రెస్టారెంట్ వెనుక శాంతినగర్ 2వ వీధిలో అద్దె ఇంట్లో ఉన్నాడనే సమాచారంతో ఇంద్రపాలెం ఎస్సై డి.రామారావు ఆధ్వర్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్టు సీఐ పవన్‌కుమార్ తెలిపారు. నిందితుడు నుంచి 3.877 కిలోల బంగారు ఆభరణాలు, 650 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితుడు దొంగతనాలకు ఉపయోగించిన ఉడ్ కట్టర్ సామగ్రి, అద్దె కారును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గతంలో ఇతనిపై పెదపూడి పోలీసులు కేసు నమోదు చేయగా, రాజమహేంద్రవరంలోని జ్యూవైనల్ హోమ్‌కి ఒకసారి వెళ్లివచ్చాడన్నారు. మూడు నెలల క్రితం కొవ్వాడ సాయిబాబా గుడి వీధిలో రిటైర్డ్ టీచర్ పడాల శ్రీనివాసరెడ్డి ఇంట్లో చోరీ చేసిన 33 కాసుల బంగారం, ఇదే గ్రామంలో రైల్వే గేటు వెనకాల ఉన్న వెజ్జుల లక్ష్మీపతిరావు ఇంట్లో చోరీ చేసిన 180 గ్రాముల బంగారం, 1.5 కిలోల వెండి, కాకినాడ శాంతినగర్‌లో ఓ మహిళ కణితపై డమ్మీ తుపాకీ గురిపెట్టి 13 కాసుల బంగారం.. రికవరీ చేసిన దాంట్లో ఉన్నట్టు చెప్పారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు.