వైద్య సేవలు మెరుగుపరుస్తాం
వికారాబాద్ రూరల్ : వైద్య సేవలు సామాన్యుడికి చేరువయ్యేలా మెరుగుపరుస్తామని రాష్ర్ట ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. అనంతగిరిలో ఆయూష్ ఆధ్వర్యంలో శనివారం హరితహారం నిర్వహించారు. ఈ సందర్భంగాఽ రాష్ర్ట రవాణాశాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలిసి వికారాబాద్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో వార్డు వార్డుకు తిరిగి పరిశీలించారు. రోగులతో వైద్య సేవల తీరుపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులకు సరఫరా చేసే మందుల గదికి వెళ్లి ఏ ఏ మందులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకున్నారు.
వర్షాకాలంలో సీజన్ వ్యాధులు విజృంభించే నేపథ్యంలో మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. అనంతరం మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. త్వరలో 100 పడకల ఆస్పత్రి పూర్తవుతుందని, పనులు ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. అప్పటి వరకు ఈ ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆస్పత్రిలో డాక్టర్ల కొరత ఉందని పలువురు తెల్పడంతో చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.
మార్చురీ కూడా ఇబ్బందులు వస్తున్నాయని రైల్వేకు జనరల్‌కు ఒకే మార్చురీకి కావడంతో ఒక్కో రోజు ఐదు మృతదేహాలు అక్కడ ఉంటున్నాయని మంత్రి దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు. దీంతో వెంటనే దాని గురించి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రుల వెంట ఎమ్మెల్యే సంజీవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, వైస్ చైర్మన్ సురేష్, జెడ్పీటీసీ ముత్తార్ షరీఫ్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, కార్మిక విభాగం అధ్యక్షుడు కృష్ణ, టీఆర్‌ఎస్‌వీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి శుభప్రద్‌పటేల్, కౌన్సిలర్లు తదితరులు ఉన్నారు.