కేఎంసీలో మెడికో ఆత్మహత్య
♦ ఉరి వేసుకున్న ఎంబీబీఎస్ ఫైనలియర్ విద్యార్థిని మౌనిక
♦ ఈ నెల 22 నుంచి పరీక్షలు..
♦ చదవడం పూర్తి కాలేదని విద్యార్థుల ముందు ఆవేదన
♦ మానసిక ఒత్తిడితో చనిపోయి ఉండొచ్చు: కుటుంబ సభ్యులు
సాక్షి, వరంగల్: వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో ఎంబీబీఎస్ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థిని ఎంఎస్ మౌనిక(23) మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. మానసిక ఒత్తిడి భరించలేకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మరో 15 రోజుల్లో ఆమె ఫైనలియర్ పరీక్షలు రాయాల్సి ఉంది. హైదరాబాద్‌లోని షేక్‌పేట దర్గాలో నివాసముంటున్న సుభాష్ యాదవ్, నిర్మల దంపతుల కుమార్తె మౌనిక. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం నుంచి ఆమె కళాశాలలోని హాస్టల్‌లో ఉంటోంది.
ఈ నెల 22 నుంచి జరగనున్న ఫైనలియర్ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు కాలేజీలోని లక్కిరెడ్డి భవనంలో 19వ నంబర్ గదిలో రెండు వారాల నుంచి ఒంటరిగా ఉంటోంది. అన్ని విభాగాలను చదవడం పూర్తి కాలేదని తరచూ ఆమె టెన్షన్ పడేదని తోటి విద్యార్థులు చెబుతున్నారు. సోమవారం రాత్రి 12 గంటల వరకు తోటి విద్యార్థులతోనే గడిపింది. అంతకుముందు సాయంత్రం పాల ప్యాకెట్‌తో పాటు కొన్ని వస్తువులు కావాలంటూ దోబీకి రూ.100 ఇచ్చింది.
ఆ డబ్బును దోబీ సూపర్‌వైజర్‌కు ఇవ్వగా.. ఆయన మౌనిక చెప్పిన వస్తువులు తెప్పించారు. మంగళవారం ఉద యం 11 గంటలకు స్నేహితులు మౌనిక గదికి వెళ్లి గది తలుపు కొట్టగా ఎంతకీ తెరవలేదు. దీంతో కిటికీలు తెరిచిన చూడగా మౌనిక ఊరి వేసుకుని కనిపించింది. వాచ్‌మన్ వచ్చి కిటికీ ధ్వంసం చేసి లోపలకు వెళ్లి గది తలుపు తెరిచారు. వెంటనే కేఎంసీ ప్రిన్సిపల్ విద్యాసాగర్‌కు సమాచారమిచ్చారు. ఆయన హాస్టల్‌కు చేరుకుని ఘటన విషయాన్ని పోలీసులకు తెలిపారు. నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు కాలేజీకి వచ్చి మౌనిక ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. ప్రిన్సిపల్ నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ఎంజీఎం మార్చురీలో మృతదేహం
కూతురు ఆత్మహత్య చేసుకుందన్న సమాచారం అందడంతో మౌనిక తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి సాయంత్రం 4.30 గంటలకు కేఎంసీకి వచ్చారు. మానసిక ఒత్తిడి వల్లే మౌనిక ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చన్న తండ్రి సుభాష్ ఫిర్యాదుతో పోలీ సులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని ఎంజీఎం ఆస్పత్రి మార్చురీకి తరలించారు.