గోరింట పండింది.. | mehndi-special | Sakshi
Sakshi News home page

గోరింట పండింది..

Published Sat, Jul 16 2016 11:20 PM | Last Updated on Mon, Sep 4 2017 5:01 AM

గోరింట పండింది..

గోరింట పండింది..

– ఆషాడంలో గోరింటాకు ఉత్సవం 
– ఆడవారి అరచేతుల్లో అందమైన డిజైన్లు 
– అతివలకు ఇష్టమైన వేడుక
 
‘గోరింట పూసింది కొమ్మా లేకుండా.. మురిపాల అరచేత మొగ్గ తొడిగింది.. ఎంచక్కా పండేలా ఎర్రన్ని చుక్క..’ అన్నారో సినీ కవి. ఏ సందర్భమూ లేకుండా చేతులకు గోరింటాకు పెట్టుకోవడం కూడా ఓ వేడుకే. గోరింటను అరచేతుల్లో పూయించడం అంటే అతివలకు అత్యంత ఇష్టం. మందారంలా పండినా, గులాబీలా పూసినా.. చేతులను చేసుకుని మురిసిపోతుంటారు. మనదేశంలో ప్రాచీన కాలం నుంచి గోరింటాకుకు ఎంతో చరిత్ర ఉంది. సున్నితమైన వారికి ఎర్రటి గోరింటాకు శోభాయమానంగా ఉంటుంది. ఆడపడుచుల చేతులు, కోమల పాదాలకు ఇనుమడింపజేసే అందమైన డిజైన్లు చూస్తే మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతుంది.  ఆషాడమాసంలో ప్రత్యేకంగా నిర్వహించే ‘గోరింటాకు’పై ప్రత్యేక కథనం..
– మహబూబ్‌నగర్‌ కల్చరల్‌  
 
 
గోరింట.. ఆరోగ్య ఔషధం 
వర్ష రుతువులో గోరింటాకు పెట్టుకుంటే చర్మ వ్యాధుల బారి నుంచి రక్షణ పొందవచ్చనేది ఆరోగ్య రహస్యం. అందుకే ఆషాడమాసంలో వానలు ఎక్కువై ఇంటి లోగిళ్లు, పంట పొలాలు బురదమయమై, క్రిమి కీటకాలు పెరుగుతాయి. మహిళలు వాటిలో కాళ్లు, చేతులు ఆడిస్తూ పని చేయడం పరిపాటి కాబట్టి వారికి చర్మ రోగాలు దరిచేరకుండా గోరింటాకును పెట్టుకునే వారు. కేవలం అలంకరణగానే కాకుండా గోరింటాకును హెయిర్‌ డైగా,  గోరింటాకు పొడిని హెన్నాగా ఉపయోగిస్తున్నారు. గోరింటాకుకు గాయాలను మాన్పే గుణం ఉంటుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ వల్ల గోర్లను, పాదాలను, చేతులను రక్షిస్తుంది. దీని సహజ గునాల వల్ల తలనొప్పి చర్మవ్యాధులు, లివర్‌ సమస్యలు వంటివి నయమవుతాయి. ఔషధ గుణాల వల్ల గొంతులో ఇన్‌ఫెక్షన్, కాళ్ల మంటలు తగ్గుతాయి. శరీరంలోని వేడిని తగ్గించే శక్తి గోరింటకే ఉంది. 
 
శాస్త్రీయ ప్రయోజనాలు..
స్త్రీలు గోరింటాకు పెట్టుకోవడం శుభప్రదంగా భావిస్తారు. ఆషాడంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలున్నాయి. గోరింట వల్ల గోళ్లకు అందం రావడమే కాక, గోరు చుట్టు వంటివి రాకుండా ఉంటాయి. గోరింటాకు ఎర్ర మందారంలా పండితే మంచి మొగుడొస్తాడని, సింధూరంలా పూస్తే కలవాడొస్తాడని పెద్దలు చెబుతారు. అదే వివాహితలకు అయితే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు చెబుతారు. అందుకే ఆషాడం వచ్చిందంటే చాలు ‘గోరింటాకు పెట్టుకోకూడదటే ఆ చేతులకూ’ అని బామ్మలు, అమ్మమ్మలు సణుగుడు మొదలెడతారు. వాళ్ల గోడు తట్టుకోలేక పెళ్లికాని ఆడపిల్లలు గోరింటాకు తీసుకొచ్చి, అందులో చింతపండు ముద్దవేసి మధ్యమధ్యలో నాలుగు బొట్లు మజ్జిగ వేస్తూ నూరుతారు. మెదిగిందా లేదా అని రోట్లోకి ఆకును తోసేటప్పుడే చిలకముక్కుల్లా ఎర్రగా పండిన అమ్మ చేతులని చూస్తుంటేనే కడుపు నిండేలా ఉంటుంది. కొత్తగా పెళ్లయి, పుట్టింటికి వచ్చిన నవ వధువులు కూడా ఆషాడంలో చేతుల నిండా గోరింటాకు పెట్టుకొని తిరిగి, అత్తారింటికి వెళ్లాక అమ్మ, చెల్లిపెట్టిన గోరింటాకు చేతులను చూసుకుంటూ వారి జ్ఞాపకాల్లో మునిగిపోతారు. ఎర్రగా పండిన చేతులను భర్తకు చూపించి మురిసిపోవడమే కాకుండా వాటి తీపి జ్ఞాపకాలు పదిలం చేసుకుంటారు. ఎన్నో సద్గుణాలున్న ఈ గోరింట ఏ పేరుతో పిలిచినా, ఏ విధంగా ఉపయోగించినా మంచే చేస్తుంది.  
 
మెహందీ పేరుతో వేడుకలు..
వివిధ రకాల మెహందీ డిజైన్లు వాడుకలోకి రావడం వల్ల  అందం కోసం గోరింటాకును మహిళలు అలంకరించుకోవడం అధికమై, కాలక్రమేణ పట్టణప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. గోరింటాకు అలంకరించుకోని ఉత్సవం ఉండదు. కొన్ని ప్రాంతాల్లో మెహిందీ ఫంక్షన్‌ పేరిట పెళ్లికి ముందే గోరింటాకు పెట్టుకోవడాన్నే ఒక సంప్రదాయంగా పాటిస్తున్నారు. గోరింటాకును ఇప్పుడు అనేక రూపాల్లో, అనేక రకాలుగా వాడుతున్నారు. ఒరిజినల్, బ్లాక్‌మెహందీ, నెయిల్‌ పెయింట్‌ మెహందీ ప్రధానమైనవి. వేలాదిగా మెహందీ డిజైన్‌లు ఆడవారి చేతులపై విరబూస్తున్నాయి. వాటిలో ట్రెడిషనల్, బుట్ట, చుడి, కాశ్మీరీ, బ్రైడల్, బాందినీ, జర్దోసి, అరబిక్, రాజస్థానీ, మర్వారి తదితర డిజైన్లు ఉన్నాయి. మెహందీ డిజైనింగ్‌ ఇప్పుడు అతి పెద్ద వ్యాపారంగా మారింది. 
 
గోరింటాకు పేస్టు తయారీ ..
గోరింటాకు పేస్టు తయారీలో ఎన్నో రకాల పద్ధతులను అనుసరిస్తూ ఉంటారు. గోరింటాకు అందంగా, ఎర్రగా పండి చేతులు, పాదాలకు చక్కటి అందం రావాలంటే ముందుగా, గోరింటాకు నాణ్యతను పరిశీలించారు. మిశ్రమాన్ని సరైన పద్ధతిలో తయారు చేసుకోవాలి. అలాగే గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. గోరింటాకు ఆకులను కానీ లేదా పొడిని కానీ వేడి నీళ్లు కలిపి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇంకా బ్లాక్‌ టీలో కలిపి నాన»ñ డితే మరింత డార్క్‌ కలర్‌తో గోరింట పడుతుంది. మెహందీ లేదా హెన్నాకు కాఫీ పౌడర్‌ కలుపుకుని రాత్రంతా నాన బెట్టాలి. తర్వాత రోజు చేతులకు పెట్టుకోవడం వల్ల కాఫీ బ్రౌన్‌ కలర్‌లో పండుతుంది. నిమ్మరసంతో పంచదార వేసి చిక్కటి సిరఫ్‌లా తయారు చేసుకోవాలి. మెహందీ చేతులకు పెట్టుకున్న తర్వాత తడి ఆరే సమయంలో ఈ లెమన్‌ సుగర్‌ సిరప్‌ను చేతులకు అప్లై చేయాలి. దీని వల్ల మెహందీ చేతిలో ఎండిపోయినా రాలిపోకుండా తిరిగి తడిగా ఉండేలా చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement