- రంగంలోకి దిగిన క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌లు
ఎస్.అన్నవరంలో వ్యక్తి హత్య
Published Sun, Apr 2 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM
తుని రూరల్ (తుని) :
ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మండలంలోని ఎస్.అన్నవరం.. బోణం బాబ్జీ (36) దారుణ హత్యతో ఉలిక్కిపడింది. ఆదివారం తెల్లవారుజామున రక్తపు మడుగులో పడి ఉన్న బాబ్జీ మృతి చెందినట్టు గుర్తించిన స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రూరల్ సీఐ జి.చెన్నకేశవరావు, ఎస్సై ఎం.అశోక్ సిబ్బందితో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాబ్జీ హత్యకు గురైనట్టుగా నిర్ధారణకు వచ్చిన పెద్దాపురం డీఎస్పీ సూచనల మేరకు కాకినాడ నుంచి డాగ్ స్క్యేడ్, వేలు ముద్రల నిపుణులకు రప్పించారు. సిమెంట్, కంకర రాతికి ఉన్న రక్తపు మరకలు, తలవెంట్రుకల ఆధారంగా డాగ్ స్క్వాడ్ మొదట (ఫస్ట్ ట్రాక్) గ్రామ శివారు కనకదుర్గమ్మ ఆలయ శివారు ఇనుప గేటు వద్దకు వెళ్లి నిలిచిపోయింది. డాగ్ స్క్వాడ్ (రెండవ ట్రాక్) మృతుడి ఇంటికి వద్ద నిలిచిపోయింది. ఇంటికి తాళం వేసి ఉండడంతో డాగ్ స్వా్యడ్ వెనుతిరిగింది. అక్కడికి సమీపంలో కల్లు దుకాణం ఉండడంతో అక్కడికి నిందితులు ఎవరైనా వెళ్లారా అన్న కోణంలో విచారణ చేపట్టారు. మృతుడు స్థానిక మద్యం బెల్టు దుకాణం వద్ద వెళ్లినట్టు సమాచారం ఉంది. అదేవిధంగా హతుడి సమీపంలో ఖాళీ సారా ప్యాకెట్లను గుర్తించారు. హతుడి నివాసానికి సమీపంలోనే ఈ సంఘటన చోటుచేసుకుంది. వేలిముద్రల నిపుణులకు ఆధారాలు లభించలేదు. బాబ్జీ హత్య కేసును ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తామని సీఐ చెన్నకేశవరావు తెలిపారు.
కూలి పనులకు వెళ్లొచ్చాడు..
పాత సంచుల మరమ్మతు పనులు చేస్తుంటే బాబ్జీ తరుచూ గొల్లప్రోలు, గుంటూరు తదితర ప్రాంతాలకు వెళ్లి పనులు చేసుకుని వారానికి ఒకసారి ఇంటి వస్తుంటాడు. ఒకటి, రెండు రోజులు గ్రామంలో ఉండే అతడు మద్యం సేవిస్తుంటాడని, ఎవరితో పాత కక్షలు, తగాదాలు లేవని స్థానికులు తెలిపారు. గుంటూరు నుంచి శనివారం ఉదయం ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే భార్య పుట్టింటికి వెళ్లడంతో రోజుంతా దుకాణాల చుట్టూ తిరుగుతూ మద్యం తాగి తెలిసింది. మద్యం సేవించిన తర్వాత ఎవరితోనైన గొడవ పడి హత్యకు గురై ఉంటాడన్న అనుమానం వ్యక్తమవుతోంది. హతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. బాబ్జీ హత్యకు గురైన సమాచారం తెలియడంతో ఆదివారం ఉదయం పుట్టింటి నుంచి అతని భార్య, కుమార్తె గ్రామానికి చేరుకుని బోరున విలపించారు.
Advertisement