మానసిక వికలాంగురాలిపై సామూహిక లైంగిక దాడి
♦ బాధితురాలు ఏడు నెలల గర్భిణి
♦ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన..
♦ ఐదుగురిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు
తర్లుపాడు : మానసిక వికలాంగురాలిపై సామూహిక లైంగిక దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులపై గురువారం తాడివారిపల్లె పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎస్సై చౌడేశ్వర్ కథనం ప్రకారం.. మండలంలోని తుమ్మలచెరువుకు చెందిన యువతికి అదే మండలం గానుగపెంటకు చెందిన వ్యక్తితో తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేకపోవటంతో ఆమెను భర్త వదలి పెట్టాడు. ఆ క్రమంలో స్వగ్రామం తుమ్మలచెరువు చేరింది. ఇంతలో తల్లిదండ్రులు మరణించటంతో అనాథగా మారింది.
మానసిక వికలాంగురాలిపై స్థానికులు కొందరు కన్నేశారు. భోజనం పెడతామంటూ స్థానికంగా నివాసం ఉండే ఐదుగురు మహబూబ్‌బాషా, యూసిన్, పెద్ద మాబూ, కబీరు, సంజయ్‌లు పలుసార్లు పశువాంఛ తీర్చుకున్నారు. విషయం తెలుసుకున్న కామాంధులు గుట్టుచప్పుడు కాకుండా ఆమెకు అబార్షన్ చేరుుంచేందుకు ప్రయత్నించారు. 7 నెలలు దాటిన గర్భిణికి గర్భస్రావం చేస్తే ప్రాణహాని ఉంటుందని వైద్యులు హెచ్చరించారు. తిరిగి ఆమెను గ్రామానికి తీసుకొచ్చారు.
అనంతరం బాధితురాలి దూరపు బంధువు ఆమెకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పొదిలి సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిందితులు మహబూబ్‌బాషా, యూసిన్, పెద్ద మాబూ, కబీరు, సంజయ్‌లపై ఎస్సై చౌడేశ్వర్ నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులుకాగా ఇద్దరి పేర్లు పోలీసులు తప్పించినట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.