-
–నాసికరం భోజనం పెడుతున్నారని ఆరోపణ
-
అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై దాడులు
-
పోలీసులకు ఫిర్యాదులు
-
పట్టించుకోని మెడికల్ కళాశాల అధికారులు
జిల్లాకే గర్వకారణమైన ప్రభుత్వ మెడికల్ కళాశాల స్టూడెంట్ మేనేజ్‌మెంట్ హాస్టల్ నిర్వహణలో అడుగడుగునా అవినీతి.. అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. నాసిరకం భోజనం పెడుతూ రూ.లక్షలు దోచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై నాలుగు రోజుల క్రితమే గొడవలు ప్రారంభమై పోలీసులకు ఫిర్యాదులు వెళ్లినా అధికారులు పట్టించుకోవడం లేదు.
నెల్లూరు(అర్బన్):
నెల్లూరు నగరం దర్గామిట్టలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పెట్టే నాసిరకం భోజనం తినలేకపోతున్నామని మెడికోలు అంటున్నారు. ఈ విషయమై ప్రశ్నించిన విద్యార్థులపై వార్డెన్‌కు సపోర్ట్‌గా ఉన్న వారు శనివారం దాడి చేశారు. విషయం పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. ఈ విషయాలపై ‘సాక్షి’ ఆరా తీయగా పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి.
టెండర్లు లేవు.. బిల్లులుండవు:
ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 300 మంది మెడికోలు వైద్య విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో 130 బాలురకు ఒక మెస్‌ను వార్డెన్ హోదాలో డాక్టర్ రామన్ నిర్వహిస్తున్నారు. 144 మంది బాలికలకు డాక్టర్ లక్ష్మి హాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. హాస్టల్‌ను నిర్వహించాలంటే కార్పొరేషన్ అనుమతితో టెండర్లు పిలవాలి. ఎవరు తక్కువకు కొటేషన్ ఇస్తే వారికే నిర్వహణ అప్పగించాలి. ఇక్కడ అందుకు విరుద్ధంగా జరుగుతోంది.
లెక్కలు చెప్పమనేసరికి గొడవలు:
మెస్ లెక్కలు చెప్పమని సీనియర్ విద్యార్థులు గత శుక్రవారం అడిగినందుకు వార్డెన్ డాక్టర్ రామన్ పర్యవేక్షణలో చెప్పిన లెక్కలు కాకి లెక్కలుగా ఆరోపించారు. ఒక్కదానికీ లెక్క చూపలేదు. బిల్లులు లేవు. తెల్లకాగితం మీద రాసి చూపుతున్నారు. ఇదెక్కడి న్యాయమని విద్యార్థులు ప్రశ్నించారు. దీంతో వార్డెన్లు కమిటీ సభ్యులుగా ఉన్న వారిని విద్యార్థులపైకి ఉసికొల్పారనే ఆరోపణలున్నాయి. శనివారం సాయంత్రం గొడవలు తారాస్థాయికి చేరడంతో కొట్టుకున్నారు.
లేడిస్ హాస్టల్‌లో మరీ దారుణం:
లేడీస్ హాస్టల్ వార్డెన్ డాక్టర్ లక్ష్మిది తిరుపతి. ఆమె వారంలో రెండు, మూడు రోజులు తిరుపతికి వెళ్తారు. మెస్ నిర్వహణ బాధ్యతను కేర్ టేకర్‌పైనే మోపుతున్నారు. కేర్ టేకర్ విద్యార్థినుల నుంచి మెస్ బిల్లులు వసూలు చేస్తుంటారు. అయితే కొంత మంది దగ్గర రూ.3,200, మరికొంతమంది వద్ద రూ.3,500 వంతున వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. డబ్బులిస్తే సమయపాల లేకుండా బాలికలను షాపింగ్‌కు పంపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలల క్రితం ఓ యువతి మిస్సింగ్ పేరిట పోలీసులకు ఫిర్యాదు కూడా అందింది.
మార్కులు కట్ చేస్తారనే భయంతోనే మెస్‌కు:
వైద్య వృత్తిలో కీలకమైన మార్కులు ఎంతో కీలకం. అవి వార్డెన్‌లుగా ఉన్న డాక్టర్ల చేతిలో ఉంటాయని, వారిని ప్రశ్నిస్తే మార్కులు పోతాయన్న భయంతో ఇష్టంలేకున్నా మెస్‌లో తింటున్నామని విద్యార్థులు ‘సాక్షి’ వద్ద వాపోయారు.
డబ్బులు తిన్నారనేది అపోహ మాత్రమే – డాక్టర్ రవిప్రభు, ప్రిన్సిపల్, మెడికల్ కళాశాల
రూ.50 వేలు మిస్‌యూజ్ అయ్యాయని విద్యార్థులు అపోహ పడుతున్నారు. వాస్తవం లేదు. ఈ విషయమై కొట్టుకోలేదు. విద్యార్థులు నెట్టుకున్నారు. విషయాన్ని పరిశీలిస్తున్నాం.