- ఎనిమిది మంది విద్యార్థులకు అస్వస్థత
వికటించిన మధ్యాహ్నభోజనం
Published Tue, Aug 9 2016 12:19 AM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM
ధర్మపురి : కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం కమలాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్నభోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు విద్యార్థులకు అన్నంతోపాటు ఆలుగడ్డ కూర, సాంబారుతో మధ్యాహ్నభోజనం పెట్టారు. పాఠశాలలో మొత్తం 82 మంది విద్యార్థులుండగా 70 మంది భోజనం తిన్నారు. ఆహారం తిన్న గంట వ్యవధిలోనే ఒక్కొక్కరికి వాంతులు మొదలయ్యాయి. తర్వాత కడుపునొప్పంటూ పలువురు విద్యార్థులు పడిపోయారు. వీరిలో ఎనిమిది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిగా పాఠశాలకు చేరుకున్నారు. కొందరిని ఆటోల్లో, మరి కొందరిని 108లో ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీహెచ్‌వో వసంతరావు ఆధ్వర్యంలో వైద్యులు ఇందు, శ్రీపతి విద్యార్థులు చికిత్స అందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిలో ఎం.రాజు, ఎం.మౌనిక, ఎం.స్రవంతి, సీహెచ్.మధుకర్, ఎం.విఘ్నేష్, పి.రాజేశ్వరి, వి.నిథిన్‌లున్నారు. విద్యార్థులకు ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ వైద్యులతో మాట్లాడారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పీఏసీఎస్ ౖచెర్మన్ బాదినేని రాజేందర్ ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థుల పరిస్థితిని సమీక్షించారు.
Advertisement