నిశీధి వేళ.. విషాదం
నిశీధి వేళ.. విషాదం
Published Thu, Sep 29 2016 11:57 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
ఆ ముగ్గురూ.. స్నేహితులు. ఆడుతూ పాడుతూ.. పనులు చేసుకునేవారు. అనుక్షణం కలిసే ఉండేవారు. అప్పటివరకూ సరదాగా గడిపిన వారు అంతలోనే విగతజీవులయ్యారు. అర్ధరాత్రి వేళ.. దారికాచిన మృత్యువు ముగ్గురినీ ఒకేసారి కబళించింది. నిండా 25 ఏళ్లుకూడా లేని ఆ యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరినీ కలచివేసింది.
నరసాపురం రూరల్ : మరికొద్దినిమిషాల్లో ఇల్లు చేరతామని భావించిన ఆ యువకులను రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. బుధవారం అర్ధరాత్రి వేళ.. జరిగిన ఈ హృదయవిదారక ఘటన నరసాపురం మండలం రుస్తుంబాదలో పెనువిషాదాన్ని నింపింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. రుస్తుంబాదకు చెందిన మీసారపు సురేంద్ర(25), పాలపర్తి అశోక్(20), దాసరి మణిరాజు(20) స్నేహితులు. వీరిలో సురేంద్ర, అశోక్ తాపీపనిచేస్తూ ఉంటారు. మణిరాజు ఎలక్రీ్టషియన్. ముగ్గురూ అనుక్షణం కలిసే ఉండేవారు. బుధవారం అర్ధరాత్రి వారు ముగ్గురూ మోటార్‌సైకిల్‌పై నరసాపురం నుంచి రుస్తుంబాదకు వస్తుండగా, గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఫలితంగా ముగ్గురూ అక్కడికక్కడే రక్తపుమడుగుల్లో దుర్మరణం పాలయ్యారు. దీంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. రుస్తుంబాద రోదనలతో మిన్నంటింది. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. గ్రామంలోని అందరితోనూ కలుపుగోలుగా ఉండే ఈ ముగ్గురూ మరణించడం ప్రతిఒక్కరినీ కలచివేసింది.
తండ్రిలాగే.. కొడుకూ
రోడ్డు ప్రమాదానికి బలి
సురేంద్ర తల్లిదండ్రులు శ్యామల రావు, మిస్సమ్మ నిరుపేదలు. వారికి ముగ్గురు సంతానం. సురేంద్రతోపాటు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వీరిద్దరికీ పెళ్లిళ్లయిపోయాయి. సురేంద్ర తండ్రి శ్యామలరావు చాలాకాలం క్రితం రోడ్డు ప్రమాదంలోనే మరణించాడు. తల్లి ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లారు. సురేంద్ర ఒక్కడే గ్రామంలో ఉంటూ తాపీ పనిచేస్తూ జీవిస్తున్నాడు. ఇంకా పెళ్లికాలేదు. ఈ క్రమంలో అతను మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం పోలీసులు నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ట్రైనీ ఎస్సై చంద్రశేఖర్ సీఐ రామచంద్రరరావు ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబానికి చేదోడువాదోడుగా..
దాసరి మణిరాజు ఎలక్రీ్టషియన్. అతని తండ్రి ఆనందరావు వ్యవసాయ కూలీ. ఆయనకు ముగ్గురు సంతానం మణిరాజు చిన్నవాడు. ఇతనికి అక్క, అన్న ఉన్నారు. అన్న కూడా కూలిపనులు చేస్తాడు. వీరెవరికీ వివాహాలు కాలేదు. మణిరాజు ఎంతోకొంత సంపాదిస్తూ.. కుటుంబానికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఎంత రాత్రైనా రోజూ పనులు ముగించుకుని వచ్చే మణిరాజు రోడ్డుప్రమాదంలో దుర్మరణం పాలవడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.
చెల్లెలి పెళ్లి చేద్దామన్నాడు
పాలపర్తి అశోక్ తల్లిదండ్రులు రమేష్, మార్తమ్మ. రమేష్ తాపీపనిచేస్తూ ఉంటాడు. వీరికి ముగ్గురు సంతానం అశోక్ పెద్దవాడు. అతనూతాపీపనులు చేస్తుంటాడు. తమ్ముడు, చెల్లి ఉన్నారు. ఇటీవల అశోక్ పెళ్లిచేద్దామని తల్లిదండ్రులు భావిస్తే.. ముందు చెల్లికి వివాహం చేసిన తర్వాత తను చేసుకుంటానని చెప్పాడు. ఇంతలోనే ప్రమాదంలో అశోక్ మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్రంగా రోదిస్తున్నారు.
ప్రమాదాలకు నిలయం ఆ రోడ్డు
నరసాపురం–మొగల్తూరు రోడ్డు ప్రమాదాలకు నిల యంగా మారింది. వాహనాలు మితిమీరిన వేగంతో వెళ్లడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితం పట్టణ పోలీస్‌స్టేçÙన్ సమీపంలో లారీ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మొగల్తూరు మండలం నాగిడిపాలెం వద్ద వంతెన పూర్తవడంతో ఇటీవల రద్దీ పెరిగింది. ఒక పక్క రోడ్డు విస్తరణ పనులు చేపట్టడంతో ఒకవైపే వాహనాలను అనుమతిస్తున్నారు. దీనికితోడు మితిమీరిన వేగం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.
Advertisement