రాష్ట్ర పర్యాటక, గిరిజన, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్(ఫైల్)
సాక్షి,సిటీబ్యూరో: బ్యాంకర్ల వైఖరి కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని పథకాలు పథకాలు అమలు చేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదని రాష్ట్ర పర్యాటక, గిరిజన, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ అన్నారు. బ్యాంకర్లు నిజాయితీపరులైనలబ్దిదారులను పట్టించుకోకుండా, కమీషన్లకు కక్కుర్తిపడి ఎగవేతదారులకే ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. శుక్రవారం రవీంద్రభారతిలో ట్రైబల్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ‘ స్టాండ్ అఫ్ ఇండియా స్కీమ్’ పై ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులకు సెక్యూరిటీతో నిమిత్తం లేకుండా రూ. 10 లక్షల వరకు రుణం ఇవ్వవచ్చని నిబంధనలు ఉన్నా బ్యాంకర్లు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో బినామీదారులు గిరిజనుల రుణాలను కొల్లగొడుతున్నారని, అందుకు ఖమ్మం జిల్లాలో జరిగిన సంఘటనలే ఉదాహరణగా పేర్కొన్నారు. బ్యాంకర్లు గిరిజనులకు నేరుగా రుణాలు ఇవ్వాలని కోరారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్ త్యాగరాజన్, ఎస్‌ఐడీబీఐ సంపత్ కుమార్, మాజీ మంత్రి అమర్‌సింగ్ తిలావత్, ట్రైబల్ వెల్పేర్ జీఎం కె. శంకర్ రావు, ట్రైబల్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కౌన్సిల్ అధ్యక్షుడు వీరన్న నాయక్, ఉపాధ్యక్షులు ఎల్. హేమ నాయక్, ఎ. బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.