నిజామాబాద్: ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ట్యాక్స్ వసూల్ చేయొద్దని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సిబ్బందిని ఆదేశించారు. నిజామాబాద్ జిల్లా పోచంపాడు ఘాట్ వద్ద గోదావరి పుష్కరాల పరిస్థితిపై ఉన్నతాధికారులతో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు. పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు అందుతున్న సౌకర్యాలపై మంత్రి ఈ సందర్భంగా ఆరా తీశారు. జిల్లా కలెక్టర్, ఎస్పీతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.
టోల్ గేట్ వద్ద వాహన పన్ను చెల్లించేందుకు వాహనాలు నిలపడంతో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పుష్కరాల కోసం వెళ్లే వాహనదారులు ఈ ట్రాఫిక్లో చిక్కుకు పోయారు. ఈ నేపథ్యంలో టోల్ ప్లాజా వద్ద ట్యాక్స్ వసూల్ వెంటనే నిలిపివేయాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే పోచంపాడు వద్ద పరిస్థితిపై పోచారంకు కేసీఆర్ ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నారు.