► ఏ సమాచారమూ వారికుండదు
► జిల్లాల్లో కొందరిదే పెత్తనం
► ఒక సామాజిక వర్గానికే పెద్దపీట
► రగులుతున్న ఇతర ప్రజాప్రతినిధులు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలోని ప్రజాప్రతినిధులకు మంత్రులంటే లెక్కలేదా.. వారిని కూరలో కరివేపాకులా తీసి పక్కన పెడుతున్నారా.. ఇటీవల చోటుచేసుకుంటున్న వరస ఘటనలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి. కనీసం ప్రొటోకాల్ కూడా పాటించకపోవడం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు సైతం ఒక సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులకే పెద్ద పీట వేస్తున్నారు. ఆ వర్గం వారికే స్థాయికి మించిన ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జిల్లా పరిషత్ సమావేశాలు ఏర్పాటు చేసే సందర్భంలో మంత్రులు అందుబాటులో ఉంటారా లేదా కనుక్కుని వారి షెడ్యూల్‌కు అనుగుణంగా తేదీలు ఖరారు చేయడం ఆనవాయితీ. ప్రతి జిల్లాలోనూ ఇదే పద్ధతి నడుస్తోంది. జిల్లాలో మాత్రం ఇందుకు భిన్నంగా వ్యహరిస్తున్నారు. బీజేపీ తరఫున గెలిచి మంత్రి పదవి చేపట్టిన పూడికొండల మాణిక్యాలరావుకు జెడ్పీ చైర్మన్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కనుక ఆయనతో సంప్రదించే అవకాశమే లేదు. మరో మంత్రి పీతల సుజాత దళిత సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మొదటి నుంచీ ఆమెకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. జెడ్పీ చైర్మన్ స్పందించకపోయినా జెడ్పీ సీఈవో లేదా జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని జెడ్పీ సమావేశం తేదీలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ జరగడం లేదు.
దీంతో అందరితోపాటే మంత్రులకూ సమావేశ ఆహ్వానం, అజెండా కాపీ అందుతోంది. ముందుగానే వారికి ఇతర కార్యక్రమాలు ఉండటంతో వారు సమావేశానికి రాలేని పరిస్థితి ఉంటోంది. జెడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించినా రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న నిర్ణయాలు, ఇతర విషయాలను మంత్రులే వివరిస్తారు. జిల్లాలో ఆ సంప్రదాయానికి స్వస్తి పలికారు. మంత్రుల తరఫున కూడా దుందుడుకు ఎమ్మెల్యే అధికారులపై పెత్తనం చేసేస్తూ ఉంటారు.
ఎమ్మెల్యే ఫోన్ ఎత్తకపోవడంపై డీఎంహెచ్‌వోపై అధికార పార్టీ నేతలు గురువారం జరిగిన జెడ్పీ సమావేశంలో విరుచుకుపడ్డారు. మహిళ అనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా దురుసుగా మాట్లాడటంతోపాటు ఇక్కడ తాము చెప్పిందే చేయాలని.. లేకపోతే వెళ్లిపోవాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. వీరి వైఖరి కారణంగా జిల్లాలో ఏ అధికారి కూడా మనస్ఫూర్తిగా పనిచేయలేని పరిస్థితి నెలకొంది.
ఆహ్వానమే లేదు
జిల్లాలో తెలుగుదేశం పార్టీ అంటే జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాత్రమే కాదని, అందరికి ప్రాధాన్యత ఉండాలని మిగిలిన ఎమ్మెల్యేలు ఆంతరంగికుల మధ్య వ్యాఖ్యానిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు కూడా వారికే వత్తాసు పలకడంపై అసంతప్తి వ్యక్తం అవుతోంది. వీరి వ్యవహార శైలిని ముఖ్యమంత్రి దష్టికి తీసుకువెళ్లడానికి వారు సన్నాహాలు చేస్తున్నారు