పార్టీలో, ప్రభుత్వంలో భారీ ప్రక్షాళన!!
తెలంగాణ ప్రభుత్వంలోను, టీఆర్ఎస్ పార్టీలోను భారీ ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఈనెల 11, 12 తేదీల తర్వాత భారీ మార్పులు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టు రూపొందించి, ఆ మేరకు చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. ప్లీనరీ తర్వాత ఇటు పార్టీలోను, అటు ప్రభుత్వంలోను కూడా మర్పుచేర్పులు చేసే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందుగా వివిధ సంస్థల నుంచి మంత్రులకు గ్రేడింగులు తెప్పించుకుని దాని ప్రకారం ఎవరిని ఉంచాలో, ఎవరిని తుంచాలో చూస్తున్నారు.
పనిచేయని మంత్రులు ఇకమీదట పార్టీ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుందని, అలాగే పార్టీలో చురుగ్గా ఉంటున్న ఎమ్మెల్యేలను మంత్రివర్గంలోకి తీసుకోవాలని కూడా కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక పార్టీ బలోపేతం కావాలంటే వలసలు తప్పవని కూడా నాయకులందరికీ కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు. వంద రోజుల పాలన తర్వాత నుంచే మార్పులు చేయాలని కేసీఆర్ భావించినా, మరికొంత కాలం వేచి చూసిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలనుకున్నారు. అందుకే.. ఇక ఈనెలలో దీపావళికి ముందుగానే ఆ పనులన్నీ పూర్తిచేయాలనుకుంటున్నారు.