
మంత్రుల దిష్టిబొమ్మ దహనం
కందుకూరు: ఎంసెట్-2 పేపర్ లీకేజీ వ్యవహారంపై బీజేవైఎం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం కందుకూరు చౌరస్తా శ్రీశైలం రహదారిపై విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, వైద్యారోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు పోలోజు శ్రీనివాస్‌చారి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్-2 పేపర్ రద్దు విషయంలో విద్యార్థులను మానసిక క్షోభకు గురిచేస్తుందని విమర్శించారు. అహర్నిశలు శ్రమించి ర్యాంకులు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను నిరాశకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.200 కోట్ల ఒప్పందంతో లీకేజీ వ్యవహారం జరిగిందని, దీనికి విద్యాశాఖ, వైద్యారోగ్య శాఖ మంత్రులు బాధ్యత వహించాలని ఆయన మండిపడ్డారు. వారి కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగిందని మండిపడ్డారు. దీనికి నైతిక బాధ్యత వహించి వెంటనే సంబంధిత మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సాధ మల్లారెడ్డి, ప్రధానకార్యదర్శులు నల్లబోలు నర్సింహారెడ్డి, దయ్యాల యాదగిరి, బీజేవైఎం మండల ప్రధానకార్యదర్శులు ఎల్లపల్లి లింగంయాదవ్, కళ్లెం సుధాకర్‌రెడ్డి, సీనియర్ నాయకులు మామిళ్ల అంజయ్య, గంగుల ప్రభాకర్‌రెడ్డి, కొంతం జంగారెడ్డి, సాధ ప్రవీణ్‌రెడ్డి, కళ్లెం చెన్నారెడ్డి, శ్రీశైలం, సురేష్, మహేష్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.