అదృశ్యం | missing | Sakshi
Sakshi News home page

అదృశ్యం

Published Tue, Aug 30 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM

అదృశ్యం

అదృశ్యం

  •  జిల్లాలో ఏటా పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులు
  •  తప్పిపోతున్న వారిలో మహిళలే అధికం
  • మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లాలో అదృశ్య కేసులు.. అక్రమ రవాణా సాధారణమైపోయాయి. నిత్యం ప్రతి పోలీసుస్టేషన్‌లో ఒకటి లేదా రెండు అదృశ్యం కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఇందులో ఎక్కువగా మహిళలు, అమ్మాయిలు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క మహబూబ్‌నగర్‌ రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో గతేడాది 45అదృశ్యం కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జూలై వరకే 39 కేసులు నమోదయినట్లు రికార్డు ప్రకారం తెలస్తోంది. ఇందులో కొంతమంది మతిస్థిమితం లేక,  మరికొందరు ఆరోగ్య సమస్యలుతో, ఇంకొందరు ఇతర కారణాల వల్ల కన్పించకుండా పోతున్నారు. వీరిలో చాలామంది ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదు. అదృశ్యమైన చిన్నారుల ఆచూకీ కోసం వారి తల్లిదండ్రులు ఆశతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 18ఏళ్లకు పైన ఉన్నవారు మూడేళ్లలో 963మంది అదృశ్యమయ్యారు. అందులో 259మంది ఆచూకీ లభ్యం కాలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
    •  ‘ఉపాధి’ పేరుతో గల్ఫ్‌ దేశాలకు చేస్తున్న అక్రమ రవాణాకు అంతే లేదు.  అభం శుభం తెలియని అమాయకులకు గాలం వేస్తూ కొందరు నకిలీ ఏజెంట్లు వారి వద్ద వేలకువేలు డబ్బులు వసూళ్లు చేసి ఉపాధి చూపుతామని గల్ఫ్‌ దేశాలకు పంపుతున్నారు. మూడు, నాలుగేళ్లు కుటుంబాలకు దూరంగా ఉండైనా గల్ఫ్‌లో కష్టపడి నాలుగురాళ్లు సంపాదిద్దామని వెళ్లిన అమాయకులు చాలామంది దోపిడీకి గురవుతున్నారు.అరబ్‌ దేశాలకు వెళ్లి అక్కడ అదృశ్యమైపోతున్నారు. నకిలీ ఏజెంట్ల చేతిలో జిల్లావ్యాప్తంగా ఏడాదికి సుమారుగా రెండు వేలమంది నష్టపోతున్నారు. 
    •  జిల్లాలో ఎక్కువగా వలస వెళుతున్న వారు మక్తల్, నారాయణపేట, కొడంగల్, గద్వాల నియోజకవర్గాలలో అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో దినసరి కూలీలు చాలామంది ఇతర ప్రాంతాలకు వెళ్లి అదృశ్యమయ్యారు. ముఖ్యంగా కోయిలకొండ, నవాబ్‌పేట, మద్దూరు మండల పరిధిలో ఉన్న గ్రామాలకు చెందిన కూలీలు ఎక్కువగా ఉన్నారు. ఈ ప్రాంతాలకు చెందిన వారు ముంబయి, కర్ణాటక, పుణే తదితర నగరాలకు వెళ్లడంతో పాటు గల్ఫ్‌కు వలస వెళుతున్నారు. ఇలా వెళ్లిన వారిలో చాలా మంది అమాయకులు తప్పిపోతున్నారు. కొంతమంది మహిళలు, అమ్మాయిలను ఏజెంట్లు ఇతర ప్రాంతాల్లో ‘ఉపాధి’ చూపిస్తామని తీసుకెళ్తున్నారు. వారిలో చాలా మంది వెనక్కి తిరిగి రావడం లేదు. 

    పెరుగుతున్న పెండింగ్‌ కేసులు..

    జిల్లాలో ప్రస్తుతం 74 పోలీసుస్టేషన్‌లు పని చేస్తున్నాయి. ఆయా పోలీస్‌స్టేషన్‌లో వందల సంఖ్యలో అదృశ్య కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తప్పిపోయిన వారి కోసం ఇటు కుటుంబసభ్యులు, బంధువులు గాలిస్తుంటే మరోవైపు పోలీసులు వారి కోణంలో గాలిస్తున్నారు. పోలీస్‌స్టేషన్‌లో నమోదు అయిన కేసుల్లో చాలా వరకు అదృశ్యం అయిన వారు కన్పించకపోవడంతో పెండింగ్‌లో ఉండటం విశేషం. అయితే పోలీసులు అదృశ్యం కేసులపై ఎక్కువ ఆసక్తి చూపించకపోవడం వల్ల రోజురోజుకు ఈ సంఖ్య పెరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  జిల్లాలో వారం రోజుల నుంచి కన్పించకుండా పోయిన వారిలో మర్లుకు చెందిన కవిత, బోయపల్లికి చెందిన బుచ్చన్న, మద్దూరు మండలకేంద్రానికి చెందిన సురేష్‌(13), నవాబ్‌పేటకు చెందిన లక్ష్మి(25), మక్తల్‌కు చెందిన రాణి(18), ఏనుగొండకు చెందిన అప్సర బేగం(29), రామచంద్రాపురం గ్రామానికి చెందిన నాగలక్ష్మి(23) ఉన్నారు.

     
     
     చేపట్టాల్సిన చర్యలు..
    •  పిల్లలను అక్రమంగా రవాణా చేసే ముఠాలపై పోలీసులు ఓ కన్నేసి ఉంచాలి.
    •  అనుమానితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, పోలీసులు నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలి.
    •  రైళ్లు, బస్సులను, ఇతర వాహనాల్లో ఆకస్మిక సోదాలు చేపట్టాలి.
    •  తల్లిదండ్రులకు, పిల్లలకు పాఠశాల యాజమాన్యాలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలి.
    •  పిల్లలకు ఇంటి చిరునామాలు, సెల్‌ఫోన్‌ నంబర్లు గుర్తుండేలా నేర్పించాలి.
    •  పరిచయం లేని వ్యక్తులతో వెళ్లకపోవడంతో పాటు వారు అందించే తినుబండారాలను తిరస్కరించాలి.
     
    అదృశ్య కేసు వివరాలు
    ఏడాది నమోదైనవి ఛేదించినవి 
    2013      697         221                         
    2014     869         442  
    2015     798         389
    2016     558         267
    జిల్లాలో నాలుగేళ్లుగా 2922 మిస్సింగ్‌ కేసులు నమోదు కాగా, ఇంకా 1603 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 2013లో 476, 2014లో 427, 2015లో 409, 2016లో (ఇప్పటివరకు) 291 మిస్సింగ్‌కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  
     
    ట్రాకింగ్‌ సిస్టమ్‌ ద్వారా..
    జిల్లాలో అదృశ్యం అయిన వారి కోసం ట్రాకింగ్‌ సిస్టమ్‌ సాప్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసి, దాని ద్వారా గాలిస్తున్నాం. ఇతర జిల్లాలకు కూడా ప్రత్యేక బృందాలను పంపించి, వారి ఆచూకీ కోసం వెతుకుతున్నాం. అలాగే పోలీస్‌ శాఖకు ఉన్న ప్రత్యేక గ్రూప్‌లో అదృశ్యమైన వారి ఫొటోలను పొందుపరిచి, ఇతర పోలీస్‌స్టేషన్లకు సమాచారం ఇస్తున్నాం. తల్లిదండ్రులు కానీ ఇతర కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసుకుని దర్యాప్తులు చేస్తుంటాం. అక్రమంగా తీసుకువెళ్లిన వారు ఎవరైన ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. చాలా వరకు కేసులు పెండింగ్‌లో లేకుండా చేస్తాం.
    – డీవీ శ్రీనివాసరావు, ఏఎస్పీ మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement