
పథకం ప్రకారమే హత్య
బరంపురం(భువనేశ్వర్): కళ్లికోట్ విశ్వవిద్యాలయం విద్యార్థిని తృప్తిమయి పండాను పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒడిశాలో హత్య చేసి ఆంధ్ర ప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో పాతిపెట్టినట్లు భావిస్తున్నారు. తృప్తిమయి పండా కేసు దర్యాప్తునకు సోంపేట, బారువ పోలీసులు బరంపురం వచ్చారు. ఒడిశా పోలీసులతో కలిసి కేకే వర్సిటీలో వివరాలు సేకరించారు. తర్వాత అనంతనగర్‌లోని ప్రైవేట్ లేడీస్ హాస్టల్‌కు వెళ్లి వివరాలు, ఆధారాలు సేకరించారని తెలిసింది.
శ్రీకాకుళం జిల్లా సోంపేట – బారువ మధ్య బేసి రామచంద్రపురం జాతీయ రహదారి పక్కన గుర్తు తెలియని యువతి మృతదేహాన్ని ఆగస్టు 27న స్థానికులు గుర్తించారు. రెండు రోజులు గడిచినా మృతురాలి వివరాలు తెలియలేదు. మృతదేహం వద్ద ఒడియా దినపత్రిక లభించడంతో ఒడిశావాసి అయి ఉంటుందని భావించారు. ఒడియా దినపత్రికల్లో మృతురాలి ఫొటోతో వార్తలు ప్రచురితమయ్యాయి. ఛత్రపూర్‌కు గ్రామానికి చెందిన బివేకానంద పండా, స్వర్ణమయు పండా సోంపేట పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మృతదేహాన్ని చూశారు. మృతురాలు తమ కుమార్తె తృప్తి మయి పండా(23)గా గుర్తించారు.
బీఎన్‌పూర్‌లో మిస్సింగ్..సోంపేటలో మర్డర్ కేసు
ఛత్రపూర్‌కు చెందిన బివేకనందా పండా చత్రపూర్ పోలీస్ క్వార్టర్స్‌లో ఫార్మసిస్ట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన కుమార్తె తృప్తిమయి పండా నెల రోజుల కిందట బరంపురం కళ్లికోట్ కళాశాలలో ఎంసీఏ ప్రథమ సంవత్సరంలో చేరింది. బరంపురం అనంతనగర్ లేడీస్ ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటోంది. ఆగస్టు 25 నుంచి ఆమె కనిపించడం లేదు. తృప్తిమయి తండ్రి ఫిర్యాదు మేరకు బరంపురం బీఎన్‌పూర్ పోలీస్ స్టేషన్లో ఈ నెల 26న మిస్సింగ్ కేసు నమోదైంది. 27న బేసిరామచంద్రపురం వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. సోంపేట పోలీస్ స్టేషన్‌లో హత్య కేసు నమోదు చేశారు. దీంతో ఒడిశా, ఆంధ్ర పోలీసులు సంయుక్తంగా కేసు దర్యాప్తు చేపట్టారు.
గ్యాంగ్‌స్టర్ మృతి తర్వాత..
ఛత్రపూర్ సైన్స్ డిగ్రీ కాలేజీలో చదువుతుండగా ఒక గ్యాంగ్‌స్టర్‌తో తృప్తిమయి సన్నిహితం మెలిగేదని పోలీసులకు తెలిసింది. ఆ గ్యాంగ్‌స్టర్ మృతి తర్వాత ఆమెకు బెదిరింపు కాల్స్ రావడంతో సిమ్ మార్చింది. కళ్లికోట్ వర్సిటీలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతుండడంతో బరంపురం అనంతనగర్ లేడీస్ ప్రైవేట్ హాస్టల్‌లో చేరింది. గత నెల 24న ఆమె బయట తిరిగిందని, 25న రాత్రి 9 గంటలకు ఎవరో వచ్చి పిలిస్తే బయటకు వెళ్లి తిరిగి రాలేదని హాస్టల్ వార్డెన్ చెప్పినట్లు బీఎన్‌పూర్ పోలీస్ స్టేషన్ ఐఐసీ అధికారి అశోక్ మిశ్రా తెలిపారు.
నేరస్తులు ఒడిశావారే!
పోస్టుమార్టం నివేదిక ప్రకారం తృప్తిమయి పండా హత్యకు గురైనట్లు తెలిసిందని బారువా సీఐ సూర్యనారాయణ నాయుడు తెలిపారు. పక్కా ప్రణాళికతో ఆమెను హత్య చేశారని పేర్కొన్నారు. ఒడిశాలో హత్య చేసి మృతదేహాన్ని ఆంధ్ర ప్రాంతానికి తీసుకువచ్చారని తమ ప్రాథమిక దర్యాప్తులో తెలిసిందన్నారు. హంతకులు బరంపురం, ఛత్రపూర్‌లలో ఉండి ఉంటారని పేర్కొన్నారు. ఒడిశా పోలీసుల సహకారంతో కేసు దర్యాప్తు చేస్తున్నామని, హంతకులను త్వరలో అరెస్టు చేస్తామని చెప్పారు.