
ఎమ్మెల్యే అనుచరులు చంపుతామంటున్నారు
- సీఐ హరినాథ్ క్రిమినల్ కేసులు పెడతానంటున్నాడు
- సీసీ కెమెరాలు పరిశీలించి ప్రాణరక్షణ కల్పించండి
- ప్రెస్‌క్లబ్‌లో రైల్వే క్యాంటీన్ నిర్వాహకుడు నరసింహులు
అనంతపురం రూరల్ : ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి అనుచరులు తనను చంపేస్తామంటున్నారని, వారి ఆగడాలను అరికట్టి ప్రాణరక్షణ కల్పించాలని అక్కడి రైల్వేస్టేషన్లో దాదాపు 25 సంవత్సరాలుగా క్యాంటీన్ నడుపుతున్న నరసింహులు వాపోయారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధర్మవరం రైల్వేస్టేషన్‌లో 2020 సంవత్సరం వరకు క్యాంటీన్ నడుపుకొనేందుకు రైల్వే అధికారుల నుంచి తనకు అన్ని అనుమతులూ ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే అనుచరులు ‘రైల్వే క్యాంటీన్ వదిలేసి వెళ్తావా? ప్రాణాలను వదులుకుంటావా? తేల్చుకో’ అంటూ తమపై దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నారని వాపోయారు.
ధర్మవరం సీఐ హరినాథ్ వారి అడుగులకు మడుగులు ఒత్తుతూ తమపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నాడని విచారం వ్యక్తం చేశారు. ‘ఏ తప్పూ చేయని మాపై అక్రమ కేసులు ఏంటి సార్’ అని ప్రశ్నిస్తే ‘రైల్వేస్టేషన్‌లో మందు అమ్ముతున్నావ్.. జాగ్రత్త. క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి వస్తుంది’ అంటూ సీఐ బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. ఒక పక్క ఎమ్మెల్యే అనుచరులు, మరోపక్క పోలీసుల ఒత్తిళ్లు భరించలేకపోతున్నామన్నారు. రైల్వేస్టేషన్‌లో సీసీ కెమెరాలను పరిశీలించి ధర్మవరం పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై ఎస్పీ, డీఐజీకి సైతం ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.