రామ పాదుకలతో జలగం వెంకట్రావు
- ఎమ్మెల్యే జలగం వెంకట్రావు
- భద్రాద్రి రామయ్యకు పాదుకల సమర్పణ
భద్రాచలం : ‘భద్రాద్రి కొత్తగూడెం’ జిల్లాలోని ప్రజానీకమంతా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే పాదయాత్ర చేపట్టినట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు చెప్పారు. ‘మన ప్రగతి యాత్ర’ పేరుతో కొత్తగూడెం నుంచి భద్రాచలం రామాలయం వరకు ఆయన చేపట్టిన పాదయాత్ర బుధవారం రాత్రి ముగిసింది. భద్రాచలం చేరుకున్న జలగం వెంకట్రావుకు బ్రిడ్జి సెంటర్‌లో సీనియర్ న్యాయవాది, ముఖ్య అనుచరుడైన రమణారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్రిడ్జి సెంటర్ నుంచి యూబీ రోడ్ మీదగా రామాలయం వరకు పాదయాత్ర సాగింది. దేవస్థానం ఈఓ రమేష్‌బాబు ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వెంకట్రావుకు పూలమాల వేసి స్వాగతం పలికారు. దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు అందజేశారు. వాటిని శిరస్సుపై పెట్టుకుని గర్భగుడిలో ప్రాంగణంలోకి జలగం చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆ తరువాత, యాత్రలో భాగంగా తీసుకొచ్చిన వెండి పాదుకలను శిరస్సుపై ఉంచుకుని గర్భ గుడిలోకి ప్రవేశించి స్వామి వారికి సమర్పించారు. పాదుకలకు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకట్రావుకు అర్చకులు, వేద పండితులు వేదాశీర్వచనం ఇచ్చారు. అనంతరం లక్ష్మీ తాయార వారు, అభయాంజనేయ స్వామిన ఆలయాలను దర్శించుకుని పూజలు చేశారు.
ప్రజలు అభివృద్ధి కావాలి
పాదయాత్ర ముగింపు సందర్భంగా విలేకరులతో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వార్యాలతో అభివృద్ధి చెందాలనేదే తన పాదయాత్ర ప్రధాన లక్ష్యమని అన్నారు. కొత్త జిల్లాలో రైతులు బాగుండాలన్నారు. ఇందుకోసం కొత్తగా ఏర్పాడే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్త ప్రాజెక్టులు, కొత్త ఫ్యాక్టరీలను నెలకొల్పడం ద్వారా అంతా బాగుండాలనే పట్టుదలతో రాబోయే రోజుల్లో పనిచేస్తామని అన్నారు. భద్రాచలం రాములోరి దర్శనం తరువాత ఇదే కార్యాచరణతో ముందుకు వెళ్తామన్నారు. జలగం పాదయాత్ర నేపథ్యంలో భద్రాచలం సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై కరుణాకర్, ట్రాఫిక్ ఎస్సై అబ్బయ్య పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
రెండో రోజు పెద్దమ్మ గుడి నుంచి..
పాల్వంచ రూరల్: కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు చేపట్టిన మన ప్రగతి పాదయాత్ర రెండో రోజు బుధవారం పాల్వంచ మండలంలోని పెద్దమ్మగుడి నుంచి ప్రారంభమైంది. అమ్మవారికి పూజలు చేసి యాత్ర ప్రారంభించారు. జగన్నాథపురం, రంగాపురం, బూర్గంపాడు, సారపాక మీదుగా భద్రాచలం వరకు పాదయాత్ర సాగింది. పాదయాత్రలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.