- పోలవరం నిర్వాసితుల సమస్యలపై పీవోతో చర్చించిన ఎమ్మెల్యే
- గ్రామాన్ని ఖాళీ చేసే నాటికే కటాఫ్ తేదీగా నిర్ణయించాలి
- రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి
నిర్వాసితులందరికీ న్యాయం జరిగేవరకూ పోరాడతాం
Published Wed, Jul 12 2017 12:01 AM | Last Updated on Tue, Sep 5 2017 3:47 PM
రంపచోడవరం :
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా నిర్వాసితులైన అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగే వరకూ పోరాడతామని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై సోమవారం రాత్రి ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్‌తో చర్చించారు. అర్హులైన వారికి రీహేబిటేషన్ అండ్ రీ సెటిల్‌మెంట్ (ఆర్‌అండ్‌ఆర్) అమలు చేయాలని కోరారు. దేవీపట్నం మండలం కొండమొదలు గ్రామంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పొందేందుకు అర్హత ఉన్న వంద మంది పేర్లు ప్యాకేజీ జాబితాలో లేవని నిర్వాసితులు ఎమ్మెల్యే, పీవో ఎదుట చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ముంపునకు గురైయ్యే గ్రామాల్లో గ్రామాన్ని ఖాళీ చేసే తేదీని కటాఫ్ తేదీగా నిర్ణయించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. అప్పటికి గ్రామంలో ఉన్న 18 సంవత్సరాలు నిండిన యువతీ,యువకులుకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వర్తింపజేయాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటరు గుర్తింపు కార్డులు లేని పరిస్ధితి ఉందని వారిని అనర్హులుగా ప్రకటించారని పీవో ఎదుట నిర్వాసితులు వాపోయారు. వారి స్టడీ సర్టిఫికెట్స్ ఆధారంగా వయస్సు నిర్ధారించి ప్యాకేజీ అమలు చేయాలని నిర్వాసితులు కోరారు.
ఆరు నెలలుగా రాని ఉపా«ధి వేతనాలు:
గోదావరి వెంబడి నివసించే గిరిజనులు కష్టాలు అధికారులు పట్టించుకోవడం లేదని కొండమొదలు నివాసి మంగారావు అన్నారు. ఆరు నెలలుగా ఉపాధి హామీ వేతనలు చెల్లించలేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు.దీనిపై ఎమ్మెల్యే రాజేశ్వరి మాట్లాడుతూ నిర్వాసితులు న్యాయం చేసేందుకు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలిపారు. ఐటీడీఏ పీవోతో సమావేశమైన నిర్వాసితులు సమస్యలు చర్చించనున్నట్లు తెలిపారు. మడిపల్లి, మంటూరు, నేలకోటలో అర్హులైన వారికి ప్యాకేజీ ఇవ్వాలన్నారు. నిర్వాసితుల సమస్యలపై పీవో సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే రాజేశ్వరి తెలిపారు.
Advertisement
Advertisement