
బాబు బొమ్మలతో దోమలు పోతాయా..!
ప్రొద్దుటూరు టౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బొమ్మలతో ర్యాలీలు చేస్తే.. దోమలు పోతాయా అని ప్రొద్దటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. దోమలపై యుద్ధం పేరుతో పట్టణంలో మంగళవారం మున్సిపల్ అధికారులు, చైర్మన్, వైద్యాధికారులు, సిబ్బంది.. విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పుట్టపర్తి సర్కిల్ వద్ద విద్యార్థులు మానవహారంగా ఏర్పడ్డారు. అనంతరం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.
దోమల నివారణకు విద్యార్థులను పిలుచుకొచ్చి రోడ్ల వెంట ర్యాలీలు చేస్తే ఎలాంటి ప్రయోజనాలు ఉండవన్నారు. చైర్మన్, కమిషనర్ చిత్తశుద్ధితో పని చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. శానిటేషన్ సిబ్బంది ఒక లక్ష్యాన్ని ఎంచుకుని పని చేయాలన్నారు. ప్రజల్లో చైతన్యం కలిగించడానికి మీడియా ద్వారా ప్రచారం చేయాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా నివారణ అధికారి త్యాగరాజు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సత్యరంగయ్య, మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామిరెడ్డి, వైస్ చైర్మన్ జబీవుల్లా, ఎన్జీఓ అధ్యక్షుడు రఘురామిరెడ్డి, కౌన్సిలర్ కోనేటి సునంద, టీడీపీ పట్టణాధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు, ఎంఈ సురేంద్రబాబు, డీఈలు రాజేష్, ఆర్‌కే శ్రీనివాసులు, టీడీపీ నాయకుడు ఫరీద్, మెప్మా సీఓలు, ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.