అధికార పార్టీ పెత్తనానికి వేదిక
- జన్మభూమి తీరుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి
కూడేరు : ‘జన్మభూమి - మా ఊరు’ కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి కాకుండా అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల దౌర్జన్యాలకు, ఘర్షణలకు వేదిక అయిందని ఉరవకొండ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. కూడేరులో బుధవారం ‘జన్మభూమి’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ టీడీపీ పాలనపై దుమ్మెత్తి పోశారు. అర్హత ఉన్న నిరుపేదలకు సంక్షేమ పథకాలు దక్కడం లేదని, అర్హులకు న్యాయం చేద్దామని అధికారులు భావించినా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఒత్తిడి తెచ్చి వారికి ఆ అవకాశం లేకుండా చేస్తున్నారని విమర్శించారు. అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు మితిమీరిపోయాయన్నారు.
జన్మభూమిలో పింఛన్ అడిగిన వికలాంగులు, రేషన్‌కార్డు అడిగిన పేదలపై దాడులకు దిగడమే అందుకు నిదర్శనమన్నారు. తమ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతిని«ధులకు లబ్ధి చేకూర్చే విధంగా నడుచుకోవాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను ఆదేశించడం చాలా దారుణమన్నారు. పక్కాగృహాలు అరకొరగా మంజూరు చేసి, అవి కూడా టీడీపీ వారికే దక్కేలా చేస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీల నియామకంతో ప్రజల చేత ఎన్నుకోబడిన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు, ఎమ్మెల్యేలకు విలువ లేకుండా పోయిందని, ఈ కమిటీలతో అర్హులకు తీరని అన్యాయం జరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. బాబు నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ప్రజల్లో భారీ వ్యతిరేకత ఉందని, చంద్రబాబు ప్రజల ఆగ్రహానికి గురయ్యే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఆయనతోపాటు ఎంపీపీ మహేశ్వరి, జెడ్పీటీసీ నిర్మలమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు ఉన్నారు.