అరెస్టులతో ఆపలేరు
- సమçస్యలపై ప్రశ్నిస్తే గొంతు నొక్కుతారా?
- 80 శాతం ప్రజల్లో సంతృప్తి ఉంటే 30, 144 సెక‌్షన్లు ఎందుకు
- పోలీసులు లేకుండా పాలించగలరా!
- రాష్ట్ర ప్రభుత్వంపై ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వ ఫైర్
అనంతపురం : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ పాలన సాగిస్తున్నారని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. ఉరవకొండలో ఆందోళన కార్యక్రమాల నేపథ్యంలో హౌస్ అరెస్టులో ఉన్న ఆయన శనివారం సాయంత్రం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఉరవకొండ పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఆందోళన చేస్తే బలవంతంగా అరెస్ట్ చేశారన్నారు. ఆపై విడుదల చేసినట్లే చేసి ఇంటికి వచ్చాక హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు తీర్చకుండా ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో కొనుగోలు చేసిన భూమిలో పేదలకు పట్టాలివ్వాలని రెండేళ్లుగా పోరాడుతున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముసుగులో ప్రజల హక్కులను కాలరాస్తోందని దుయ్యబట్టారు. తమ పాలనపై 80 శాతం ప్రజలు సంతృప్తి చెందుతున్నారని ప్రభుత్వం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. అదే నిజమైతే మరి రాష్ట్రమంతా 30 యాక్టు, 144 సెక‌్షన్ ఎందుకు అమలు చేస్తున్నారని, అంత అసాధారణ పరిస్థితి ఏమొచ్చిందని మండిపడ్డారు. పోలీసులు లేకుండా పరిపాలన సాగించే ధైర్యం ప్రభుత్వానికి ఉందా అని ఆయన ప్రశ్నించారు. తీరు మార్చకోకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు.
ప్రచార యావ తప్ప.. ప్రజల సమస్యలు పట్టవు
ముఖ్యమంత్రికి కేవలం ప్రచార యావ తప్ప ప్రజల సమస్యలు పట్టడం లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు శంకరనారాయణ విమర్శించారు. స్వయంగా ఎమ్మెల్యే పోరాటాలు చేస్తుంటే స్పందించకపోగా, అక్రమ కేసులు బనాయిస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌కు ఉరవకొండ ప్రజల సమస్యలు పట్టడం లేదన్నారు. పేదల ఇళ్ల కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని టీడీపీ నాయకులు కబ్జా చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఈ సమావేశలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వీరన్న, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఆలూరి సాంబశివారెడ్డి పాల్గొన్నారు.