ప్రభుత్వం మీనమేషాలు
వజ్రకరూరు : హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉరవకొండ మండల పరిధిలోని రేణుమాకులపల్లిలో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. గ్రామంలోఇంటింటికీ వెళ్లి రైతులు, మహిళలు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలను కలుసుకొని ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉరవకొండ ప్రాంతంలోని రేణుమాకులపల్లి, చీకలగురికి డిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు.
ఆగస్టులో హంద్రీనీవా ద్వారా 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. హంద్రీనీవా ద్వార ఉరవ కొండ ప్రాంతంలోని 80 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అనేక రోజులు డిమాండ్ చేస్తున్నా దాన్ని అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదన్నారు. హక్కుగా ఇవ్వాల్సిన నీటి విషయంలో ప్రభుత్వం రైతులపై ప్రభుత్వం ఆంక్షలు విధించడం సరికాదన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు, ఉరవకొండ , బెళుగుప్ప మండలాల్లో హంద్రీనీవా కాలువ సమీపంలో రైతులు లక్షలాది రూపాయలు వ్యయం చేసి పంటలు సాగుచేశారన్నారు. ప్రస్తుతం పంటలు మధ్యదశలో ఉన్నాయన్నారు. ఈనేపథ్యంలో రెవెన్యూ అధికారులు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ అధికారులు రైతుల వద్దకు వెళ్లి పైపులు ,మోటార్లు వెంటనే తీసివేయాలని లేని పక్షంలో స్వాదీనం చే సుకుంటామని హెచ్చ రించడం భాదకరమన్నారు.
ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో నీటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్నారు. రబీ సీజన్‌లో రైతులకు రుణాలు మంజూరు చేయాల్సి ఉన్నా ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. నగదు రహితలావాదేవీలంటూ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందన్నారు. మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు మంజూరు చేయకపోవడం దారుణమన్నారు. సమావేశంలో ఉపసర్పంచు పెద్ద ఆంజనేయ, మాజీ సర్పంచు వీరభద్రప్ప, వైఎస్సార్‌సీపీ కిసాన్‌సెల్ రాష్ట్రకార్యదర్శి రాకెట్ల అశోక్, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, జెడ్పీటీసీ తిప్పయ్య, జిల్లా అధికార ప్రతినిధి వీరన్న , వైఎస్సార్‌సీపీ నాయకులు తదితరులు ఉన్నారు.