టీచర్ల నెత్తిన ప్రచార కత్తి
►నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం
►ఉపాధ్యాయులకు ఇష్టం లేకున్నా తిప్పుతున్న అధికార పార్టీ నేతలు
►తమ అభ్యర్థుల గెలుపుకోసం మరో 24 గంటలు శ్రమించాలని హుకుం జారీ
►పాఠశాలల్లో జన్మభూమి కమిటీలదే పెత్తనం
►దగ్గరపడుతున్న పబ్లిక్ పరీక్షలు
►అయోమయంలో తల్లిదండ్రులు, విద్యార్థులు
టీచర్ల నెత్తిన ప్రచార కత్తి వేలాడుతోంది. ఇష్టం ఉన్నా.. లేకపోయినా తమ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాల్సిందేనని అధికార పార్టీ నేతలు హుకుం జారీచేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే నెల రోజులుగా ప్రచారపర్వంలో మునిగితేలిన ఉపాధ్యాయులు మరో 24 గంటలపాటు మరింత శ్రమించాల్సిందేనని సంబంధిత అధికారులు సైతం ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. దగ్గరపడుతున్న పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు సరైన న్యాయం చేయలేక.. అధికారులు, రాజకీయ ఒత్తిళ్లు భరించలేక పలువురు బడిపంతుళ్లు తలలు పట్టుకుంటున్నారు.
తిరుపతి ఎడ్యుకేషన్: తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీల నియోజకవర్గం పరిధిలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాతోపాటు చిత్తూరు, ప్రకాశం జిల్లాలున్నాయి. ఈ మూడు జిల్లాల్లో ప్రధాన ఉపాధ్యాయ సంఘాలకు చెందిన నాయకులు, సిట్టింగ్ ఎమ్మెల్సీలు బరిలో ఉన్నారు. ఈనెల 9వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరి గెలుపునకు ఆయా ఉపాధ్యాయ సంఘాలు, అధికార పార్టీ నేతలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా టీడీపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు బోధన వదిలి ప్రచారబాట పట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రెండింటికీ సంబంధం లేని మరికొన్ని ఉపాధ్యాయ సంఘాలు స్వతంత్ర అభ్యర్థులను బలపరుస్తూ బడికి టాటా చెప్పినట్టు కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద జిల్లాలో 40నుంచి 60 శాతం మంది ఉపాధ్యాయులు ఎన్నికల్లో తీరిక లేకుండా గడుపుతున్న భోగట్టా.
ఇష్టం లేకపోయినా ప్రచారంలోనే ఉండాలట!
ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు, జన్మభూమి కమిటీల ఆదేశాలతో కొందరు ఉపాధ్యాయులు ఇష్టం లేకపోయినా ప్రచారపర్వాన్ని నెత్తికెత్తుకుని ఆపసోపాలు పడాల్సి వస్తోంది. తమ అభ్యర్థుల విజయానికి సహకరించిన వారికి అన్నివిధాలా పార్టీ అండదండలు ఉంటాయని ఎమ్మెల్యేలు భరోసా ఇస్తున్నట్టు కొందరు ఉపాధ్యాయులే చెబుతున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఇబ్బందులు, ఒత్తిడులు రాకుండా జన్మభూమి కమిటీలు మేనేజ్ చేస్తున్నాయి. అన్నిరకాలుగా సహకరిస్తుండడంతో కొందరు ఉపాధ్యాయులు బడికి టాటాచెప్పి ప్రచారానికి పరిమితమైనట్టు తెలుస్తోంది.
సందిగ్ధంలో విద్యార్థుల భవితవ్యం
దాదాపు సగం మంది ఉపాధ్యాయులు నెలరోజుల నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తలమునకలైపోయారు. ఈనెల 17 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానుండడంతో విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. 5 నుంచి 17 వరకు 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్–3పరీక్ష జరగాల్సి ఉంది. కానీ ఎన్నికల కారణంగా ఈ పరీక్షలను 15 నుంచి 25వ తేదీ వరకు వాయిదావేశారు. దీనివల్ల ఉపాధ్యాయులు కష్టనష్టాలు ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఉదయం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, మధ్యాహ్నం సమ్మేటివ్ పరీక్షలు నిర్వహించడం కత్తిమీద సాములాంటిదేనని పలువురు వాపోతున్నారు.