చైతన్యం..వినియోగదారుని ఆయుధం
చైతన్యం..వినియోగదారుని ఆయుధం
Published Sat, Dec 24 2016 11:21 PM | Last Updated on Mon, Sep 4 2017 11:31 PM
– ప్రతి కొనుగోలుకు విధిగా బిల్లు తీసుకోవాలి
–ప్రశ్నించేతత్వాన్ని అలవాటు చేసుకోవాలి
– జాతీయ వినియోగదారుల దినోత్సవంలో జేసీ హరికిరణ్
కర్నూలు(అగ్రికల్చర్): వినియోగదారులకు ఎన్నో హక్కులు ఉన్నాయని.. చైతన్యమనే ఆయుధంతో వాటిని సాధించుకోవచ్చని జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని శనివారం.. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ముఖ్య అతిథిగా జేసీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి మొదలు సాధారణ పౌరుడి వరకు ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని.. వీరికి అనేక హక్కులు ఉన్నాయన్నారు. హక్కులపై సమగ్రమైన అవగాహన కల్పించడమే జాతీయ వినియోగదారుల దినోత్సవం ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. కొనుగోలు చేసే ప్రతి వస్తువుకు విధిగా బిల్లు తీసుకోవాలని సూచించారు. బిల్లు ఉంటే తీసుకున్న సరుకులు నకిలీవైనా.. తగిన నాణ్యతతో లేకపోయినా వినియోగదారుల ఫోరం కేసువేసి తగిన పరిహారం పొందవచ్చని తెలిపారు. ఒకటి కొంటే మరొకటి ఉచితం అనే ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. ప్రశ్నించేతత్వాన్ని ప్రతి వినియోగదారుడూ అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షురాలు నజిరున్నీసా, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శశీదేవీ, జిల్లా వినియోగదారుల సేవ కేంద్రం ఇన్‌చార్జి నదీమ్ హుసేన్ మాట్లాడారు. కర్నూలులో ఆహార పదార్థాల నాణ్యతను పరీక్షించే ప్రయోగశాల ఏర్పాటు చేయాలని సూచించారు. అంతకు ముందు జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి రాజ్ విహార్ వరకు ర్యాలీ నిర్వహించారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసి వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారో అవగాహన కల్పించారు.
ఆకట్టుకున్న నాటికలు
వినియోగదారులు ఏ విధంగా మోసపోతున్నారో.. కేవీఆర్ కాలేజి, శ్రీలక్ష్మీ స్కూల్ విద్యార్థులు నాటికల రూపంలో చూపించారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతులను జేసీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ కృష్ణారెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ సత్యనారాయణ చౌదరి, జిల్లా పరిశ్రమల కేంద్రం ఏడీ మదన్‌మోహన్‌శెట్టి, లీగల్ అడ్వైజర్ శివసుదర్శనం, జిల్లా వినియోగదారుల మండలి అధ్యక్ష, కార్యదర్శులు మద్దిలేటి, శివమోహన్‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement