మోపిదేవి కుటుంబానికి తప్పిన ప్రమాదం
విజయవాడ: వైఎస్ఆర్ సీపీ నేత, మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ కుటుంబం తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఆయన ప్రయాణిస్తున్న కారు బుధవారం ఉదయం కృష్ణాజిల్లా కానూరు వద్ద ప్రమాదానికి గురైంది. ఉయ్యూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి మోపిదేవి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన భార్య, కుమార్తెకు స్వల్ప గాయలయ్యాయి.
గాయపడినవారిని విజయవాడలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా గాయపడినవారికి ఎలాంటి ప్రమాదం లేదని, హఠాత్తుగా ప్రమాదం జరగటంతో వారు షాక్కు గురైనట్లు వైద్యులు తెలిపారు. మోపిదేవి కుటుంబం హైదరాబాద్ నుంచి రావులపాలెం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.