రైతుల అభివృద్ధికి మరిన్ని పరిశోధనలు
రైతుల అభివృద్ధికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు.
– వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు రావాలి
– రజతోత్సవంలో శాసనమండలి చైర్మన్ చక్రపాణి యాదవ్
ఎంసీ ఫారం(మహానంది): రైతుల అభివృద్ధికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాసనమండలి చైర్మన్ చక్రపాణియాదవ్ అన్నారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ కళాశాల రజతోత్సవాల ముగింపు సందర్భంగా రూ. 6.50కోట్లతో నిర్మించనున్న పీజీ భవనం, బాలుర, బాలికల వసతి గృహాల నిర్మాణాలకు భూమి పూజలు చేశారు. వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు సభ్యుడు, బగనానపల్లె ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా చక్రపాణి యాదవ్ మాట్లాడారు. ఉత్సవాల్లో తీసుకున్న నిర్ణయాలను తనకు పంపితే ఫిబ్రవరి–మార్చి బడ్జెట్ సమావేశంలో తగిన నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. బీఎస్సీ వ్యవసాయం కోర్సును ఐసీఏఆర్ ఫ్రొఫెషనల్ కోర్సుగా గుర్తింపు ఇచ్చిన సందర్భంగా వ్యవసాయ కళాశాల వారు తయారు చేసి రూపొందించిన కేటలాగ్‌ను విడుదల చేశారు. అలాగే సావనీర్‌ను ఆవిష్కరించారు.
సమస్యల పరిష్కారానికి కృషి..
రైతులు తలెత్తుకుని తిరిగేలా ప్రతి వ్యవసాయ విద్యార్థి సైనికుల్లా పనిచేయాలని బనగానపల్లె శాసనసభ్యులు బీసీ జనార్దన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మహానంది వ్యవసాయ కళాశాలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం డీన్ ఆఫ్ అగ్రికల్చర్ డాక్టర్ తాతినేని రమేష్‌బాబు మాట్లాడుతూ.. వ్యవసాయ కళాశాలలో రూ. 6.50కోట్లతో అభివృద్ధిపనులు చేపడుతున్నామన్నారు. పనులన్నీ 18 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మహానంది కళాశాల స్వర్ణోత్సవాలను జరుపుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో మహానంది కళాశాలలో అన్ని పీజీ కోర్సులను ప్రారంభిస్తామన్నారు. పైలాన్ ఏర్పాటుకు, ఇతర పనులకు పూర్వ విద్యార్థులు 1.60లక్షలు విరాళంగా ఇవ్వడం అభినందనీయమన్నారు.
రైతులకు అండగా..
వ్యవసాయ విద్యార్థులు.. రైతు కుటుంబాలకు అండగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్ ధనుంజయరెడ్డి అన్నారు. మన దేశం ఇతర దేశాలపై ఆధారపడకుండా ఆహారోత్పత్తి చేస్తున్న ఘనత రైతులదే అన్నారు. వ్యవసాయంస్థూల ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలో 28 శాతంతో ముందంజలో ఉందన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం బోర్డు మెంబర్లు గణపతిరావు మాట్లాడుతూ.. అప్పుల్లో పుట్టి..అప్పుల్లో పెరిగి...వారసులకు అప్పునే వారసత్వంగా ఇస్తున్న ఏకైక వృత్తిదారులు రైతులే అని ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం శాసనసభ్యురాలు, మీసాల గీత , జాతీయ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మేకల లక్ష్మినారాయణ , బోర్డు మెంబరు మురళీనా«థ్‌రెడ్డి , శాసనసభ్యులు బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, మహానంది వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ బాలగురవయ్య, నంద్యాల ఆర్‌ఏఆర్‌ఎస్ ఏడీఆర్ గోపాల్‌రెడ్డి, ఎంపీపీ చింతం నాగమణి, పూర్వ విద్యార్థులు కేవి కిషోర్‌రెడ్డి, వి.అనిల్‌కుమార్ పాల్గొని ప్రసంగించారు.