కీర.. లాభాలు జరజర
కీర.. లాభాలు జరజర
Published Tue, Oct 25 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 6:17 PM
– కొత్త పంట వైపు మెట్ట రైతుల చూపు
– తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందుతున్న వైనం
– విదేశాలకు ఎగుమతులు
జంగారెడ్డిగూడెం : మెట్ట ప్రాంత రైతులు కొత్త కొత్త పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఎప్పుడూ ఈ ప్రాంతంలో పండని పంటలు వేసి పలువురు ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతేగాక తక్కువ కాలంలో అధిక ఆదాయం కూడా సాధిస్తున్నారు. మెట్టప్రాంతంలోని లింగపాలెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది రైతులు జర్కిన్స్ (కీర దోస) పంట పండిస్తున్నారు. దీంతో అధిక లాభాలు సాగిస్తున్నారు. సుమారు 100 మందికి పైగా రైతులు మెట్టమండలాల్లో దీనిని సేద్యం చేస్తున్నారు. ఎకరానికి 10 వేల విత్తనాలు నాటడం ద్వారా సేద్యం కొనసాగిస్తున్నారు. జర్కిన్స్ విత్తనాలను ఓ ప్రై వేట్ కంపెనీ సరఫరా చేస్తోంది. ఎకరానికి అన్ని ఖర్చులు కలుపుకుని సుమారు రూ. 45 వేలు ఖర్చవుతుండగా పంటపై లక్ష రూపాయల వరకు ఆదాయం లభిస్తోంది. పంట దిగుబడి 30 రోజుల నుంచి 60 రోజుల వరకు వస్తుంది. పండిన పంటను జహీరాబాద్‌కు చెందిన గ్లోబల్ గ్రీన్ కంపెనీ తన ప్రతినిధుల ద్వారా కొనుగోలు చేస్తోంది.
విదేశాలకు ఎగుమతి
జర్కిన్స్ కాయలను ఆస్ట్రేలియా, రష్యా, అమెరికా, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, కెనడా తదితర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. జర్కిన్స్ కాయలు గ్రేడ్‌ను బట్టి కంపెనీ ధర ఇస్తుంది. 18.5 ఎంఎం సైజు ఉన్న కాయను ఒకటో రకం గ్రేడ్‌గా గుర్తించి టన్నుకు రూ.18 వేలు చెల్లిస్తోంది. 25 ఎంఎం సైజుగా ఉన్న కాయ టన్నుకు రూ.11 వేలు, 33 ఎంఎం సైజు ఉన్నlకాయకు టన్నుకు రూ.4 వేలు చెల్లిస్తోంది. ఈ రకం కీరదోస పచ్చివి తినేందుకు, సలాడ్, సూప్ , చట్నీ, పచ్చళ్లు చేసుకునేందుకు ఉపయోగిస్తారు. వైద్యపరంగా కూడా ఇవి ఎంతో మేలైనవని వైద్యులు చెబుతున్నారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు పంట వేసుకునేందుకు అనుకూలమైన రోజులు. కేవలం 60 రోజుల్లో ఎకరానికి సుమారు రూ.50 వేల వరకు ఆదాయం లభిస్తుందని రైతులు చెబుతున్నారు. కీరదోస వల్ల గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు నియంత్రణ, క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. దీనిలో పోలేట్, ఐరన్, కాల్షియం, విటమిన్ ఎ తదితర పదార్థాలు అధికంగా ఉంటాయి. రైతులు ఈ పంట వేసేందుకు ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తూ సబ్సిడీలు ఇస్తోంది. స్థానికంగా పంట అంతా ఎక్కువగా విదేశాలకు ఎగుమతి అవుతుంది.
సాగుకు ఆసక్తి చూపుతున్న రైతులు
దీంతో రైతులకు మంచి ధర కూడా లభిస్తోంది. ఏటా మనదేశం నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా కీరదోస పంట ఎగుమతి అవుతోంది. దీనిపై దేశానికి రూ.1,000 కోట్ల మేర ఆదాయం లభిస్తోంది. దీంతో ఈ ప్రాంత రైతులు కూడా జర్కిన్స్ వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇసుకతో కూడిన మట్టినేలలు, 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లో ఈ పంట బాగా పండుతుంది. పాదుల రూపంలో ఎదిగే ఈ పంటకు కర్రలను పాతి దానిపైకి ఎగబాకిస్తారు. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా తక్కువ నీటి ఖర్చుతో ఈ పంట పండుతుంది.
మంచి ఆదాయం
జర్కిన్స్ పంట ద్వారా మంచి ఆదాయం వస్తుంది. 30 రోజుల నుంచే దిగుబడి మొదలవుతుంది. ఇలా నిత్యం 60 రోజుల వరకు పంట వస్తూనే ఉంటుంది. ఎకరానికి రూ.40 నుంచి రూ.45 వేలు ఖర్చవుతుంది. ఆదాయం రూ.లక్ష వరకు వస్తుంది. తక్కువ రోజుల్లో డబ్బు చేతికి అందుతుంది. ఎక్కువమంది వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించవచ్చు.
– ఘంటా రాఘవేంద్రరావు, రైతు, మఠంగూడెం
సబ్సిడీ ఇస్తున్నాం
జర్కిన్స్ పంట (కీర దోస) వేసే రైతులకు ఉద్యానశాఖ ద్వారా సబ్సిడీ ఇస్తున్నాం. పాదులు పైకి ఎగబాకేలా ఏర్పాటు చేసుకునేందుకు కర్రలు, ఇనుప వైర్లు ఏర్పాటుకు ఎకరానికి రూ. 8 వేలు సబ్సిడీ ఇస్తున్నాం. ఈ పంట మంచి ఆదాయాన్ని ఇస్తుంది. దీంతో రైతులు సాగుకు ముందుకు వస్తున్నారు. ప్రై వేట్ కంపెనీలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి.
– అడపా దుర్గేష్, ఏడీ, ఉద్యాన శాఖ, జంగారెడ్డిగూడెం
Advertisement
Advertisement