యువతి హత్య కేసులో తల్లి, సోదరుల అరెస్టు | Mother and brothers arrested in teenager's murder case | Sakshi
Sakshi News home page

యువతి హత్య కేసులో తల్లి, సోదరుల అరెస్టు

Published Sat, Oct 15 2016 4:58 PM | Last Updated on Sun, Apr 7 2019 4:36 PM

Mother and brothers arrested in teenager's murder case

ఆమనగల్లు (మహబూబ్‌నగర్ జిల్లా) : కడ్తాల మండలం మైసిగండి గ్రామ పరిధిలోని వెలుగురాళ్ల తండాలో పెళ్ళి కాకుండానే గర్భం దాల్చిన గిరిజన యువతిని హత్య చేసిన తల్లి, సోదరులను సైబరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆమనగల్లు పోలీసు స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమనగల్లు సీఐ రవీంద్రప్రసాద్ వివరాలు వెల్లడించారు. వెలుగురాళ్ల తండాకు చెందిన గిరిజన యువతి ఇస్లావత్ మంజుల పెళ్లి కాకుండానే గర్భం దాల్చడంతో అవమానంగా భావించిన కుటుంబ సభ్యులు ఈ నెల 12న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మంజులను తీసుకుని తల్లి సోని, సోదరుడు జగన్, బాబులాల్‌లు పొలం వద్దకు వెళ్ళారు. అక్కడే గర్బం దాల్చడానికి కారణమెవరని అడిగినప్పటికీ చెప్పకపోవడంతో ఆగ్రహంతో మంజులను సోనీ, బాబులాల్ పట్టుకోగా జగన్ కట్టెతో తలపై తీవ్రంగా కొట్టాడు. దీనితో అపస్మారక స్థితిలో ఉన్న మంజుల నోట్లో పురుగుల మందు పోశారు.

అనంతరం జగన్ బావమరిది గడ్డమీదితండాకు చెందిన కిరణ్ సాయంతో ముగ్గురు మంజులను ఇంటికి తీసుకువచ్చి పురుగుల మందు త్రాగి ఆత్మహత్యకు పాల్పడిందని తాండావాసులను నమ్మించారు. మరుసటిరోజు ఉదయం తండా సమీపంలోని పొలం వద్ద మృతిచెందిన మంజులను గోతి తీసి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే మంజుల హత్య విషయం బయటకు పొక్కడంతో వీఆర్‌ఓ భారతి ఫిర్యాదు మేరకు తండాకు చేరుకుని మంజుల మృతదేహాన్ని బయటకు తీసి అక్కడే పోస్టుమార్టం నిర్వహించామని సీఐ వివరించారు. దీనిపై కేసు నమోదు చేసి శనివారం తల్లి సోని, సోదరులు బాబులాల్, జగన్‌లను అరెస్టు చేశామని మరో నిందితుడు కిరణ్ పరారీలో ఉన్నాడని ఆయన వివరించారు. అలాగే మృతురాలు మంజుల గర్భం దాల్చడానికి కారణం ఎవరనే విషయంపై దర్యాప్తు జరుపుతున్నామని ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో కడ్తాల ఎస్‌ఐ రామలింగారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement