మృతి చెందిన చంద్రకళ, చిన్నారి వంశీ
గుత్తి రూరల్: పాముకాటుతో తల్లి, ఆమె పాలు తాగి బిడ్డ మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలం కొజ్జేపల్లిలో గురువారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లింగన్న, చంద్రకళ దంపతులు పశు పోషణతో జీవనం సాగించేవారు. వీరికి జగదీశ్ (3), ఏడాదిన్నర వయసున్న వంశీ అనే ఇద్దరు చిన్నారులున్నారు. గురువారం వేకువజామున చంద్రకళ పేడ ఎత్తుతుండగా ఆమె కాలిపై పాము కాటు వేసింది. అయితే, కాలికున్న పట్టీ గుచ్చుకుందని ఆమె భావించింది. పని ముగించుకొన్న తర్వాత వంశీకి పాలిచ్చింది. దీంతో చిన్నారి కూడా విషప్రభావానికి గురయ్యాడు.
ఉదయం 10 గంటల సమయంలో గుండెల్లో నొప్పిగా ఉందని చంద్రకళ కిందపడిపోయింది. ఆమెతో పాటు కుమారుడి పరిస్థితిని గమనించిన లింగన్న వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించాడు. చికిత్స పొందుతూ చంద్రకళ మృతి చెందింది. బాలుణ్ని మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురానికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. దీనితో అతను దిక్కుతోచని స్థితిలో పడి గుండెలవిశేలా రోదించాడు. ఈ సంఘటన స్థానికులనూ కంటతడి పెట్టించింది.