ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి చెందారు.. మేనత్త పెంచి పెద్ద చేసింది.. పెళ్లయినా తర్వాతైనా తన జీవితం బాగుంటుందని కలలు కనింది.. అయితే ఆమె కలలు కల్లలయ్యాయి.. భర్త నుంచి చీత్కారాలు, వేధింపులు ఎదురయ్యాయి.. పేదరికం వెక్కిరించింది.. ఇన్ని కష్టాల మధ్య జీవనం సాగించలేనని నిర్ణయించుకుంది.. తాను మాత్రమే చనిపోతే కుమారుడిని ఎవరూ చూసుకోరేమోనని భావించింది.. తనతోపాటే కుమారుడిని పైలోకానికి తీసుకెళ్లింది.
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు మండలంలోని రేగుళ్లపల్లెకు చెందిన కోనేటి జయలక్ష్మి(24) ఏడాదిన్నర వయసు ఉన్న తన కుమారుడు గౌతమ్‌పై గురువారం కిరోసిన్ పోసి నిప్పంటించి, తానూ ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రేగుళ్లపల్లెకు చెందిన నరసింహులుకు ఐదేళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన జయలక్ష్మితో వివాహం అయింది. అతను గతంలో చేనేత పని చేసే వాడు. ఆ పని గిట్టుబాటు కాకపోవడంతో చిల్లర కొట్టు పెట్టుకున్నాడు. దుకాణం కూడా సరిగా జరగకపోవడంతో ఫైనాన్స్‌లో ఆటో తీసుకున్నాడు. కంతులు కట్టని కారణంగా రెండు నెలల క్రితం ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఆటోను తీసుకెళ్లడంతో బేల్దారి పనికి వెళ్తున్నాడు.
ఇంట్లో నుంచి పొగ రావడంతో..
గురువారం ఉదయాన్నే భర్త నరసింహులు మైదుకూరు సమీపంలోని గ్రామానికి బేల్దారి పనికి వెళ్లాడు. అత్త కూడా కూలి పనికి వెళ్లింది. ఇక ఇంట్లో ఎవరూ లేని సమయంలో కుమారుడితోపాటు తనపై కిరోసిన్ పోసుకొని నిప్పు అంటించింది. ఇంట్లో నుంచి పెద్ద ఎత్తున పొగ రావడంతో దారిన వెళ్లే స్థానికులు పరుగెత్తుకుంటూ వచ్చారు. తలుపులు తీయడానికి ప్రయత్నించగా లోపల గడియ పెట్టడంతో రాలేదు. దీంతో ఇనుప పైపుతో తలుపులను పగులగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే తల్లీకొడుకులు మంటల్లో కాలి బూడిదయ్యారు.
నిత్యం సూటి పోటి మాటలతో..
జయలక్ష్మికి పెళ్లైన నాలుగేళ్ల వరకు సంతానం కలుగలేదు. దీంతో భర్త నరసింహులు ‘నీలో ఏదో లోపం ఉంది.. లేకుంటే పిల్లలు ఎందుకు పుట్టరు’ అంటూ ఆమెను సూటి పోటి మాటలతో వేధించే వాడు. పెళ్లైన మూడేళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకుంటానని కూడా అతను భార్యతో అన్నాడు. ఈ విషయాన్ని ఆమె తన మేనత్త, అన్నకు ఫోన్ చేసి చెప్పేది. ఈ క్రమంలో ఏడాది క్రితం ఆమెకు ప్రైవేట్ ఆస్పత్రిలో కవల పిల్లలు జన్మించగా.. రెండు మూడు గంటల్లోనే ఒక శిశువు మృతి చెందాడు. శిశువు ఆరోగ్యకరంగా లేకపోవడంతో వైద్యం కోసం సుమారు రూ.1 లక్ష దాకా ఖర్చు అయింది. అప్పటికే అప్పుల్లో ఉన్న నరసింహులుకు మరో రూ.1 లక్ష ఖర్చు కావడంతో అదనపు భారంగా భావించాడు. కంతులు కట్టకపోవడంతో ఫైనాన్స్ కంపెనీ వాళ్లు ఆటోను తీసుకెళ్లారు. గ్రామంలో ఇలా జరగడంతో అతను తీవ్ర అవమానంగా భావించాడు. అప్పటి నుంచి రోజూ భార్యను వేధించే వాడు. నీ వల్లే అప్పుల్లో కూరుకుపోయాయని, పుట్టింటి నుంచి డబ్బు తీసుకొని రమ్మని ఆమెను చిత్రహింసలకు గురి చేసే వాడు. ఈ నెల 2న గౌతం మొదటి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. వీధిలో వారందరికీ చాక్‌లెట్‌లను పంచారు.
పెంచి పెద్ద చేసిన మేనత్త
జయలక్ష్మి చిన్న తనంలోనే తల్లిదండ్రులు మృతి చెందారు. దీంతో ప్రొద్దుటూరుకు చెందిన ఆమె మేనత్త పద్మావతి పెంచి పెద్ద చేసింది. జయలక్ష్మి డిగ్రీ వరకు చదువుకుంది. పెళ్లి సమయంలో ఆమె జయక్ష్మికి 6 తులాల బంగారు, రూ.50 వేలు నగదు ఇచ్చింది. పెళ్లైనప్పటి నుంచి తరచూ తన వద్దకు వచ్చి డబ్బు తీసుకొని పోయేదని పద్మావతి తెలిపింది. తనను భర్త వేధిస్తున్నాడని ఆమె ఫోన్ చేసి చెప్పేదని, డబ్బు తీసుకొని రావాలంటూ కొట్టేవాడని వాపోయింది. కన్న కూతురిలా పెంచానని ఆమె రోదించ సాగింది. సంఘటన స్థలాన్ని రూరల్ పోలీసులు సందర్శించారు. సోదరుడు వెంకటసుబ్బరాయుడు ఫిర్యాదు మేరకు నరసింహులుపై వేధింపుల కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శివశంకర్ తెలిపారు.
కుమారుడితో పాటు తల్లి ఆత్మహత్య
Published Thu, Aug 11 2016 11:41 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
Advertisement