Published
Fri, Aug 5 2016 10:11 PM
| Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
మంచంపట్టిన గిరిజనం
ఎంపీ దత్తత గ్రామంలో ప్రబలిన జ్వరాలు
గొల్లమందల(ఎ.కొండూరు) :
గొల్లమందల శివారు గిరిజన తండాలో జ్వరాలు ప్రబలాయి. జ్వరంతో బాధపడుతూ సుమారు 30 మంది మంచానికే పరిమితమయ్యారు. కనీసం మందుబిళ్లలు కూడా ఇచ్చేవారు కరువయ్యారని జ్వరపీడితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండటం వల్ల దోమలు పెరిగి జ్వరాలు ప్రబలుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఎంపీ దత్తత తీసుకున్న ఈ గిరిజన తండాలో సుమారు 250 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. తండాలో రహదారికి ఇరువైపులా డ్రెయినేజీ సౌకర్యం లేకపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి దుర్వాసన వస్తోంది. దోమలు పెరిగిపోతున్నాయి. తండా వాసులందరికీ తాగునీరు తీసుకెళ్లడానికి ఒకే ఒక చేతి పంపు ఉంది. ఆ పంపు చుట్టూ మురుగు చేరి నీరు కలుషితమవుతోంది. ఈ విషయాన్ని అధికారులకు చెప్పినా ఫలితం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.