మాట నిలుపుకుందాం
♦ 27న ప్రతి పల్లెలో జెండా.. ప్రతి ఇంటా పండగ
♦ సబిత, జైపాల్‌లు జిల్లాకు ఒరగబెట్టిందేమీలేదు
♦ విపక్షాల విమర్శలను తిప్పికొట్టండి
♦ ఉద్యమకారులకు నామినేటెడ్ పదవులు
♦ టీఆర్‌ఎస్ జిల్లా సమావేశంలో ఎంపీ కవిత
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ప్రతి పల్లెలో గులాబీ జెండా.. ప్రతి ఇంట్లో పండగలా పార్టీ అవిర్భావం దినోత్సవం నిర్వహించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ‘15వ వసంతంలోకి అడుగిడుతున్న టీఆర్‌ఎస్ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది.. అఖండ విజయాన్ని సాధించింది.. ప్రజలిచ్చిన ఈ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి.. వారి ఆలోచన విధానానికి అనుగుణంగానే ముందుకు సాగాల్సిన అవరముంది’ అని ఆమె అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేసీఆర్ చెప్పే ప్రతి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందన్నారు.
కేసీఆర్ ఒక్కసారి చెప్పినా.. వందసార్లు చెప్పినట్లేనని ..విపక్షాల విమర్శలను తిప్పికొట్టేందుకు వెనుకాడవద్దని అన్నారు. పట్టుదల, లక్ష్యసాధనకు పార్టీ అధినేతే నిలువెత్తు నిదర్శనమనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. తొలుత పార్టీ.. తర్వాతే ప్రభుత్వం అని గుర్తెరిగి మసులుకోవాలని పిలుపునిచ్చారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాణహితకు కాంగ్రెస్ ఏమీ చేయలేదని విమర్శించారు. చేవెళ్ల చెల్లెమ్మ సబితక్కకు మంత్రి పదవి ఇచ్చినా వైఎస్..నిధులను ఆంధ్రాకు మళ్లించుకుపోయారని ఆరోపించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కేవలం రూ.26 కోట్లు విడుదల చేసి.. రూ.176 కోట్లు వ్యర్ధం చేశారని సబిత అసత్యప్రచారం చేస్తున్నారని కవిత అన్నారు.
చేవెళ్ల ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన జై పాల్‌రెడ్డి కేంద్రంలో మూడు పదవులు నిర్వర్తించినా..జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని విరుచుకుపడ్డారు. జిల్లాలో పార్టీకి ఒక్కరూ మిగిలారని, వారంతా పంగనామాల పార్టీల సభ్యులని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పార్టీలకతీతంగా అన్ని నియోజకవర్గాలను సమానదృష్టితో చూస్తున్నామని, నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్షకు తావివ్వడంలేదని అన్నారు.
ఆదారబాదరగా పదవులు వద్దు
పనిచేయాలనుకునే వాళ్లే టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారు. పాత, కొత్త విభేదాలొద్దు. అధికారంలో ఉంటేనే ప్రజ లకు సేవ చేయగలం అని కవిత స్పష్టం చేశారు. ఆదారబాదరగా పదవులు పంపిణీ చేయవద్దని.. పాత, కొత్త నేతల మేళవింపుతో పదవుల పంపకం చేపట్టాలని సూచించారు. జైలు, లాఠీ దెబ్బలు తిన్న ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగలేదని, వారిని నామినేటెడ్ పదవుల్లో పరిగణనలోకి తీసుకోవాల్సివుంటుందని అన్నారు. మన కు నాయకులు కాదు.. పార్టీయే ముఖ్యం. గులాబీ కండువా తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష అని కవిత అన్నారు. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ... గ్రేటర్‌లో 59 డివిజన్లు గెలిచి జిల్లాలో పార్టీ సత్తా చూపామని.. ఈ విజయాలు టీఆర్‌ఎస్ సమష్టి నాయకత్వానికి నిదర్శమని అన్నారు.
రాజకీయ పార్టీగా అవతరించిన ఉద్యమ పార్టీ..మరో 20 ఏళ్లు అధికారంలో ఉండేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకు కాలం చెల్లిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పాటుపడతామని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ సునీతారెడ్డి, ఎమ్మెల్యేలు గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు నరేందర్‌రెడ్డి, శంబీపూర్ రాజు, యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, తదితరులు పాల్గొన్నారు.