
ఎం‘టెక్కే’
- కళాశాలలకు ఆదాయ వనరుగా ఎంటెక్ కోర్సు
- ప్రమాణాలు శూన్యం
–అధ్యాపకులు, వారి సర్టిఫికెట్లు బోగస్సే
–బయోమెట్రిక్‌లోనూ మాయాజాలం
–తరగతులు లేకుండా పరీక్షలు
జేఎన్‌టీయూ : ఇంజినీరింగ్ విద్య ప్రమాణాలు రోజురోజుకూ తీసికట్టుగా మారిపోతున్నాయి. జేఎన్‌టీయూ అధికారులు ప్రతి ఏటా ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (నిజనిర్ధారణ) కళాశాల మౌలిక సదుపాయాలు, బోధన సిబ్బంది, ల్యాబోరేటరీ, గ్రంథాలయం వంటి అంశాలను పరిశీలించి నివేదికను అందిస్తుంది. తనిఖీల సమయంలో మాత్రం మొబైల్ ప్యాకింగ్ చేస్తున్న కళాశాలలు అనంతరం సౌకర్యాలను గాలికి వదిలేస్తున్నారని ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. స్వీయ ప్రకటిత పత్రాల్లో కళాశాలల యాజమాన్యాలు అన్ని సౌకర్యాలు ఉన్నట్లు ప్రకటిస్తున్నా, ఏఐసీటీఈ తనిఖీల్లో, వర్సిటీ ఆకస్మిక కమిటీ తనిఖీలల్లోను లోటుపాట్లు కనిపిస్తూనే ఉన్నాయి.
దాగుడు మూతలు ..
ఒక కళాశాలలో ఉన్న వారినే మరో కళాశాల అధ్యాపకులుగా చూపించడం, అర్హతలు లేకున్నా బోధన సిబ్బందిని నియమించడం, కొంతమంది అర్హతలతో రికార్డులు సృష్టించుకొన్నా వారి సర్టిఫికెట్ బోగస్ అని నిర్ధారణలో తేలుతోంది. చాలా కళాశాలల్లో అర్హత ధ్రువపత్రాలు చూస్తే అటువంటి వర్సిటీలు దేశ, విదేశాల్లో కూడా లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏఐసీటీఈ, యూనివర్సిటీ మార్గదర్శకాలకు అనుగుణంగా కాలేజీ యాజమాన్యాలు పాటించడం తప్పనిసరి అయినప్పటికీ పెడచెవిన పెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
యథేచ్ఛగా అక్రమాలు :
బీటెక్‌ను అందించే కళాశాలలకు ఎంటెక్ కోర్సు ఆదాయ వనరుగా మారింది. బీటెక్‌లలో సీట్లు అరకొరగా భర్తీ అవుతున్నప్పటికీ , ఎంటెక్‌లో మాత్రం సీట్లు పూర్తిస్థాయిలో భర్తీ అవుతుండడం గమనార్హం. ఒక్క జేఎన్‌టీయూ అనంతçపురం పరిధిలో 4 వేల మంది విద్యార్థులు ఎంటెక్‌ను అభ్యసిస్తున్నారు. సింహభాగం కళాశాలల్లో అడుగు పెట్టకుండానే ఎంటెక్ పట్టా ఒట్టిగా అందుకొంటున్నారు. ఇందుకు కళాశాల యాజమాన్యాల సహకారం పుష్కలంగా ఉంది. ఎంటెక్ కోర్సులలో అక్రమాలు అడ్డుకట్ట వేయాలని జేఎన్‌టీయూ బయోమెట్రిక్ విధానాన్ని ప్రతి ఎంటెక్ కోర్సులకు పాటించాలని ఆదేశించింది. విద్యార్థుల హాజరు కచ్చితంగా గుర్తించాలని అధికారులు భావించారు. ఇందులోనూ విద్యార్థులను పరీక్షలకు డిటైన్ చేయకుండా ఎంత అవసరమో అంత హాజరు శాతాన్ని చూపిస్తున్నారు.
గ్రేడింగ్ యోచన..
ఎంటెక్ తరగతుల నిర్వహణ, విద్యా పటిష్టత వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని గ్రేడింగ్‌ను ఇవ్వనున్నారు. తరగతులు నిర్వహించని కళాశాలలకు ఫీజు రీయిబర్స్‌మెంట్ రుసుమును అందించకుండా చర్యలు తీసుకోవాలనే నిర్ణయాలు అమలు చేస్తున్నట్లు తెలిసింది. ఏటా ప్రతి కళాశాలకు ఎంటెక్ ఫీజు కింద రూ. కోటి అందుతోంది. ఈ నేపథ్యంలో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలనే నిర్ణయాలు అమలు చేయనున్నట్లు తెలిసింది.
ఆధార్ అనుసంధానంతో..
అధ్యాపకులు పనిచేసే కళాశాల వివరాలు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నాం. బీటెక్, ఎంటెక్ లకు బయోమెట్రిక్ విధానం అనుసరించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రిడిటేషన్ (ఎన్‌బీఏ) అనుమతి పొందాలంటే ప్రతి కళాశాలలోని బోధన సిబ్బందిలో 50 శాతం ర్యాటిఫికేషన్ (వర్సిటీ గుర్తింపు) ఉండాలి. వర్సిటీ నియమ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని కళాశాలలపై చర్యలు తీసుకొంటాం.
–ప్రొఫెసర్ పి. చెన్నారెడ్డి , అకడమిక్ అండ్ ఆడిట్ డైరెక్టర్, జేఎన్‌టీయూ అనంతపురం.