ముద్రగడ.. సీబీఐ విచారణ వద్దంటున్నారు: చినరాజప్ప
తుని ఘటనపై సీబీఐ విచారణకు ముద్రగడ పద్మనాభం అంగీకరించడం లేదని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. అయితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిరంజీవి మాత్రం దీనిపై సీబీఐ విచారణ కోరుతున్నారన్నారు. ఈ విషయాన్ని తాము పోలీసుల ద్వారా ముద్రగడ వద్దకు పంపితే, ఆయన వద్దన్నారని చినరాజప్ప తెలిపారు. ఈ విషయంపై ప్రజలే ఆలోచించాలని ఆయన అన్నారు.
ముద్రగడకు వైద్యసేవలు చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని, అయితే ఆయనే అంగీకరించడం లేదని చెప్పారు. ఆయన చేస్తున్న డిమాండ్లు ఆమోదయోగ్యం కాదని తెలిపారు. తుని ఘటనలో అరెస్టులు ఆపాలని, ఇప్పటికే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్నారని.. అయితే ఆ విషయం కోర్టు పరిధిలో ఉన్నందువల్ల తాము ఏమీ చేయలేమని హోం మంత్రి అన్నారు. సీబీఐ విచారణ జరుగుతుందో లేదో త్వరలోనే తేలుతుందని ఆయన చెప్పారు.