హత్యా.. ఆత్మహత్యా..?
►అనుమానాస్పదంగా వివాహిత మృతి
►నేలను తాకేలా నైలాడ్ తాడుకు వేలాడుతున్న మృతదేహం
► అల్లుడే హతమార్చాడని ఆమె తల్లిదండ్రుల ఆరోపణ
రాజమహేంద్రవరం క్రైం : వివాహిత అనుమానాస్పదంగా మరణించిన సంఘటన స్థానిక మదన్‌సింగ్‌పేటలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు, మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రత్తిపాడు మండలం రాచపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది కెల్లా సత్య వెంకట ప్రభాకరరావు స్థానిక మదన్‌సింగ్‌పేటలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. ఆయన మొదటి భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో, 11 ఏళ్ల క్రితం రాచపల్లి గ్రామానికి చెందిన సింహాచలం అలియస్ రాణి అలియాస్ సుధ(36)ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదో తరగతి చదువుతున్న కుమారుడు ఆది ప్రణిత్ ఉన్నాడు. రాజమహేంద్రవరంలోనే ప్రభాకరరావు న్యాయవాద వృత్తి చేస్తున్నారు. ఇలాఉండగా ఆదివారం తెల్లవారుజామున సుధ మెడకు నైలాన్ తాడు కట్టి, గుమ్మానికి వేలాడుతూ కనిపించింది. రాత్రివేళ ఎవరో తనను తాడుతో గట్టిగా నొక్కుతుండగా అమ్మా అని కేకలు పెట్టడంతో వారు పారిపోయారని, పక్కగదిలో పడుకున్న తండ్రి వద్దకు వెళ్లి, నిద్రలేపగా.. ఆయన వచ్చి చూసేసరికి తల్లి మృతదేహం తలుపు వద్ద వేళాడుతూ కనిపించినట్టు ప్రణిత్ పేర్కొన్నాడు. అతడి మెడకు తాడుతో నొక్కినట్టు గుర్తులు కనిపించాయి.
అల్లుడే హతమార్చాడని ఆరోపణ
తమ కుమార్తెను అల్లుడు ప్రభాకరరావు హతమార్చాడని సుధ తల్లిదండ్రులు యాళ్ల నాగేశ్వరరావు, అన్నపూర్ణ ఆరోపించారు. మొదటి భార్యనూ అతడు పొట్టనబెట్టుకున్నాడని, ఇది తెలియక తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేశామని పేర్కొన్నారు. తన కుమార్తె సమక్షంలోనే మరో మహిళతో చనువుగా ఉంటూ, భార్యను కించపరిచేవాడని ఆవేదన వ్యక్తం చేశారు. తరచూ వేధిస్తున్నాడంటూ కుమార్తె చెప్పినా, సర్దుకుపోవాలంటూ కాపురానికి పంపించేవారమని, చివరకు కడుపుకోత మిగిలిందని కన్నీటిపర్యంతమయ్యారు. తమlమనవడు ప్రణిత్‌ను కూడా అతడే హతమార్చేందుకు యత్నించి ఉంటాడని ఆరోపించారు.
మృతిపై అనుమానాలు
కాగా, సుధ మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమె హతమార్చి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు తలుపుపై భాగంలో నైలాన్ తాడుతో వేలాడదీసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహం కాళ్లు నేలను తాకుతుండడం దీనికి బలం చేకూరుస్తోంది. గదిలో ఫ్యాన్ ఉండగా, తలుపు పైన కిటికీకి ఎందుకు ఉరి వేసుకుంది, రోజూ పడుకునే గదిలో కాకుండా ముందుగదిలో భర్త ఎందుకు పడుకున్నాడనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాఉండగా సంఘటన స్థలాన్ని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి, సెంట్రల్ జోన్ డీఎస్పీ కులశేఖర్, వన్‌టౌన్ సీఐ రవీంద్ర, ఎస్సై రాజ శేఖర్ పరిశీలించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. వన్‌టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.