సమయపాలన పాటించాలి
తాను అందరివాడినని, కులం, వర్గం పేరుతో ఎవరూ తన వద్దకు రావొద్దని తెలంగాణ యూనివర్సిటీ వీసీ సాంబయ్య పేర్కొన్నారు. అందరూ సమయ పాలన పాటించాలన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్సిటీలోని వీసీ చాంబర్‌లో హెచ్‌వోడీల సమావేశం నిర్వహించారు.
తెయూ(డిచ్‌పల్లి) : తాను అందరివాడినని, కులం, వర్గం పేరుతో ఎవరూ తన వద్దకు రావొద్దని తెలంగాణ యూనివర్సిటీ వీసీ సాంబయ్య పేర్కొన్నారు. అందరూ సమయ పాలన పాటించాలన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు వర్సిటీలోని వీసీ చాంబర్‌లో హెచ్‌వోడీల సమావేశం నిర్వహించారు. అయితే పది మంది హెచ్‌వోడీలు కూడా సమయానికి రాలేదు. పది, ఇరవై నిమిషాల ఆలస్యంగా వచ్చారు. దీనిపై వీసీ అసహనం వ్యక్తం చేశారు. కచ్చితంగా సమయ పాలన పాటించాలని, ఇందులో ఎవరికీ మినహాయింపులూ ఉండవని పేర్కొన్నారు. మెస్‌లో రూ. రెండున్నర కోట్ల బకాయిలు పేరుకుపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు. ఇది మన అసమర్థతకు నిదర్శనమన్నారు. ఇలా అయితే హాస్టల్స్ నిర్వహించడం కష్టమని, బకాయిలు కచ్చితంగా వసూలు చేయాలని ఆదేశించారు. యూనివర్సిటీ విషయంలో తనకు అందరూ సమానమేనని వీసీ పేర్కొన్నారు. కులం, వర్గం పేరు చెప్పుకుని ఎలాంటి భజనపరులు తన వద్దకు రావద్దని మోహం మీదే చెప్పారు. తనకు కోటరీ అవసరం లేదన్నారు. పని ఉంటేనే తన చాంబర్‌లోకి రావాలని, పని ముగిసిన తర్వాత ఒక్క నిమిషం కూడా వర్సిటీలో ఉండాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దీంతో పలువురు అధ్యాపకులు నిర్ఘాంతపోయారు. సమావేశంలో రిజిస్ట్రార్ జయప్రకాశ్‌రావు, హెచ్‌వోడీలు పాల్గొన్నారు.