టాలీవుడ్ నిర్మాత అరెస్ట్
విశాఖపట్నం: భూ ఆక్రమణకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రముఖ గృహ నిర్మాణ సంస్థ ఎంవీవీ బిల్డర్స్ అధినేత, టాలీవుడ్ సినీ నిర్మాత ఎంవీవీ సత్యనారాయణను పీఎం పాలెం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీసీసీ సీహెచ్ వెంకటేశ్వరరావు స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 357/1, 357/2 మధురవాడలో గతంలో పంచాయతీ అనుమతి పొందిన లే అవుట్‌లో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 88 మందికి స్థలాలున్నాయి.
అందులో 38 మంది నుంచి స్థలాలు సేకరించి ఎంవీవీ అధినేత సత్యనారాయణ ‘విశాఖపట్నం సీటీ’ పేరిట గృహనిర్మాణ ప్రాజెక్ట్‌ను భారీ ఎత్తున ప్రారంభించారు. ఇందుకోసం భారీ ఎత్తున ప్రకటన బోర్డులు, హోర్డింగ్‌లేర్పాటు చేసి ప్రకటనలు గుప్పించారు. ఈ క్రమంలో లే-అవుట్‌లో ఉన్న ఇతరుల భూముల్ని కూడా ఆక్రమించి రోడ్డు నిర్మించారన్నది ఆరోపణ. ఆక్రమించిన భూముల్లో వివిధ నిర్మాణాలు చేపట్టారు. అయితే తమ స్థలాన్ని ఎంవీవీ బిల్డర్ ఆక్రమించారని ఆరోపిస్తూ శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన జడ్డు విష్ణుమూర్తి పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ లక్ష్మణమూర్తి ప్రాథమికంగా ఆరోపణ రుజువు కావడంతో శుక్రవారం ఎంవీవీ బిల్డర్‌ను లాసన్స్‌బే కాలనీలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.
కాగా గతంలో కూడా పలు ఆక్రమణలకు సంబంధించి ఎంవీవీ అధినేతపై కేసు నమోదైందని డీసీపీ స్పష్టం చేశారు. కాగా, ఎంవీవీ అధినేత అరెస్ట్ నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శలొస్తున్నాయి. కాగా తనకు గుండె నెప్పిగా ఉందని బిల్డర్ చెప్పడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను కేజీహెచ్‌కు తరలించామని పీఎం పాలెం పోలీసులు స్పష్టం చేశారు.
కళా వెంకటరావు కుట్ర
నిందితుడు ఎంవీవీ సత్యనారాయణ విలేకరులతో మాట్లాడుతూ ఇదంతా టీడీపీ నాయకుడు కళా వెంకటరావు, కుటుంబ సభ్యుల కుట్రగా ఆరోపించారు. తనపై లేని పోని నిందలు మోపి తనను అభాసుపాలు చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. నిబంధనల ప్రకారమే తాను విశాఖ సిటీ ప్రాజెక్ట్ పనులు ప్రారింభించానన్నారు.
రౌడీషీట్ తెరుస్తాం
మధురవాడ ప్రాంతంలో గతం కంటే ప్రస్తుతం భూ ఆక్రమణ కేసులు తగ్గాయని, ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదులొస్తే కఠినంగా వ్యవహరిస్తున్నామని డీసీపీ స్పష్టం చేశారు. ఆక్రమణలపై ఫిర్యాదులొస్తే రౌడీ షీట్లు తెరవడానికైనా వెనుకాడేది లేదని చెప్పారు.