
ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయ్యింది!
సీనియర్ల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న రిషికేశ్వరి చివరిసారిగా రాసిన సూసైడ్ నోట్ ఆమె మానసిక స్థితిని వెల్లడించింది. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఆమె.. ఎందుకు ఏడవాల్సి వచ్చిందో, ఆమె తల్లిదండ్రులు ఆమెను ప్రేమగా చూడటమే ఎందుకు తప్పయిందో ఆ లేఖ చూస్తే తెలుస్తుంది. లేఖలో ఆమె ఏం రాసిందో రిషికేశ్వరి మాటల్లోనే...
నవ్వు.. నవ్వు.. నవ్వు.. ఈ నవ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే నేనెప్పుడూ నవ్వుతూ, అందరినీ నవ్విస్తూ ఉంటాను. కానీ ఆ నవ్వే నాకు పెద్ద సమస్య అయ్యింది. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం. నిజానికి పిచ్చి. అంత ప్రేమగా పెంచారు నాన్న. నాకు చదువంటే చాలా ఇష్టం. ఈ చదువు కోసం నా ఊరు వరంగల్ నుంచి ఇక్కడకి చదువుకోడానికి వచ్చాను. ఇలా చదువుకోడానికి వచ్చిన నన్ను సీనియర్లలో కొంతమంది చదువులోకి కాకుండా ప్రేమలోకి లాగడానికి ప్రయత్నించారు. నేను ఆ దారిలోకి వెళ్లలేదు. దాంతో నామీద రూమర్లు స్ప్రెడ్ చేశారు. అవి వింటే నా ముఖంలో నవ్వు మాయమైపోయేది. ఏడుపు కూడా వచ్చేది.
నేను నాన్న దగ్గర ఏమీ దాచేదాన్ని కాదు. కానీ ఇక్కడికొచ్చి దాయాల్సి వస్తోంది. చెబితే ఏమైపోతారో అని భయంతో దాయాల్సి వస్తోంది. అలా నేను దాచినప్పుడల్లా నాకు నరకయాతన కనిపిస్తోంది. సీనియర్లలో దీప, అవినాష్, లావణ్య, ప్రసాద్.. వీళ్లు చేసిన హెల్ప్ నేనెప్పటికీ మర్చిపోలేను. నాన్నా, వీళ్లకొక్కకసారి థాంక్స్ చెప్పండి. ఎప్పుడూ వీళ్లతో కాంటాక్ట్లో ఉండండి. నా ఆఖరి కోరిక ఒక్కటే. నా చావుకు కారణం ఎవరో నాకు తెలుసు. వాళ్లు వాళ్ల తప్పు తెలుసుకుంటే చాలు. ఇక ఎవరినీ నాలా బాధపెట్టకపోతే చాలు. ఏ అమ్మాయీ యూనివర్సిటీలో ర్యాగింగ్ ఉండదు అనుకోవద్దు.. యూనివర్సిటీ అంటేనే పెద్ద నరకం నాన్నా. ఏ తల్లిదండ్రులూ పిల్లలను ఇంత ప్రేమగా పెంచొద్దు. మీకు చెప్పలేక, వాళ్లలో వాళ్లు దాచుకోలేక వాళ్లకి నరకం కనిపిస్తుంది.
అమ్మా, నాన్నా జాగ్రత్త. నాన్నా ప్లీజ్ ఏడవకండి. నేనెప్పుడూ మీ దగ్గర్లోనే ఉంటాను. అమ్మా నువ్వుకూడా జాగ్రత్త. ఐ లవ్యూ మామ్, ఐ లవ్యూ డాడ్. ట్రై టు డొనేట్ మై ఆర్గాన్స్ ఇఫ్ దే ఆర్ ఇన్ గుడ్ కండిషన్. డాడ్, నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. అవి మీరు చేసెయ్యండి. సీనియర్ లావణ్యకి ఒక ఇంజనీరింగ్ మెకానిక్స్ బుక్ కొనివ్వండి. రాజుకి 350 రూపీస్ ఇవ్వండి. ప్రసాద్ సర్, ఇంకా జితేంద్రకి థాంక్స్ చెప్పండి. బై ఫరెవర్ అండ్ ఎవర్!