అనుచరులతో నయీం ఏం చెప్పాడు | naim want to change like dawood | Sakshi
Sakshi News home page

అనుచరులతో నయీం ఏం చెప్పాడు

Published Wed, Aug 10 2016 12:01 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

అనుచరులతో నయీం ఏం చెప్పాడు - Sakshi

అనుచరులతో నయీం ఏం చెప్పాడు

సాక్షి, సిటీబ్యూరో: ముంబై నుంచి దుబాయ్‌కు వెళ్ళిపోయి ‘డి–కంపెనీ’ పేరుతో దావూద్‌ ఇబ్రహీం చేస్తున్న దందా నయీంను ఆకర్షించింది. నగరం కేంద్రంగా ‘ఎన్‌–కంపెనీ’ ఏర్పాటు చేయాలని భావించాడు. దీనికోసం గత ఏడాది దుబాయ్‌ వెళ్ళిన నయీం అక్కడ దావూద్‌ అనుచరుల్నీ కలిశాడని తెలిసింది. వీలైనంత త్వరగా బేస్‌ను దుబాయ్‌కు మార్చేయడానికే టార్గెట్లు పెట్టుకుని మరీ వసూళ్ళకు దిగినట్లు సమాచారం. వారం రోజుల క్రితం నగర శివార్లలో అనుచరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇదే విషయాన్ని వారికి చెప్పినట్లు తెలుస్తోంది.

మూడు రకాలైన ‘సైన్యం’...
గ్యాంగ్‌స్టర్‌ నయీం నగరంతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లోనూ మూడు రకాలైన వారితో ‘సైన్యాలు’ సిద్ధం చేసుకున్నాడు. ఆయా అవసరాలకు తగ్గట్టు వీరిని వాడుకోవడానికే ఇలా ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిసింది. ఓపక్క రాజకీయ అండదండల కోసం రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు. వీరికి డబ్బు ఇవ్వడంతో పాటు కోరిన సెటిల్‌మెంట్లు చేస్తూ తన చెప్పు చేతల్లో ఉంచుకున్నాడు.

అలాగే పోలీసులకు ‘అవసరమైన పనులు’ చేసిపెట్టడం, కొన్ని రకాలైన సమాచారాలు ఇవ్వ డం తదితరాలు చేస్తూ వారితో సత్సంబంధాలు కొనసాగిం చాడు. శివారు జిల్లాలతో పాటు నగరంలోని కొన్ని ప్రాంతాలకు చెందిన రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులతోనూ నయీం సంబంధాలు కొనసాగించాడు. కొందరు యువకులకు నెలవారీ డబ్బులు ఇస్తూ తన ఆధీనంలో ఉంచుకున్నాడు.

రెండు నెలల్లో వీలైనంత ఆర్జించాలని...
ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌తో సంబంధాలు కొనసాగించిన నయీం గతంలో ఓసారి పాకిస్థాన్‌కు వెళ్ళి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే ఇతడికి దావూద్‌ ఇబ్రహీం గ్యాంగ్‌తోనూ పరిచయాలు ఏర్పడ్డాయి. గత ఏడాది దుబాయ్‌ వెళ్ళి వచ్చిన నయీం అక్కడ దావూద్‌ అనుచరుల్నీ కలిశాడు. హైదరాబాద్‌ సహా దక్షిణాదిలోని అనేక రాష్ట్రాల్లో తనకు ప్రైవేట్‌ సైన్యం ఉందంటూ వారికి చెప్పిన నయీం... దావూద్‌ మాదిరిగా ‘ఎన్‌–కంపెనీ’ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. దుబాయ్‌ కేంద్రంగా నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దందాలకు కుట్రపన్నాడు. దీనికోసం రెండు నెలల్లో దుబాయ్‌కి మకాం మార్చడానికి పథకం వేసిన నయీం అందుకు తగ్గట్లే జోరు పెంచి సెటిల్‌మెంట్లు, బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలుస్తోంది.

తుక్కుగూడలో చివరి విందు...
తన దుబాయ్‌ ఆలోచనల గురించి అనుచరులకు చెప్పడానికి నయీం గత ఆదివారం నగర శివార్లలోని తుక్కుగూడలో విందు ఏర్పాటు చేశాడు. అత్యంత సన్నిహితులైన 12 మందితో పాటు ఇతర గ్యాంగ్‌మెంబర్స్‌ సైతం హాజరయ్యారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే భారీ విందు ఇచ్చిన నయీం... తన ‘ఎన్‌–కంపెనీ’ విషయాన్ని వారికి చెప్పి, టార్గెట్లు ఇచ్చి పంపినట్లు తెలిసింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, రియల్టర్లు తదితరుల్ని టార్గెట్‌గా చేసుకున్నాడు. దీనికోసమే జర్మన్, రష్యా, బెల్జియంల్లో తయారైన అత్యాధునిక షార్ట్‌ వెపన్స్‌ను సైతం సిద్ధం చేసుకున్నాడు. సోమ–మంగళవారాల్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న వాటిలో ఇవీ ఉన్నాయి.

అశోక్‌ పేరుతో కేరళలో చికిత్స...
రెండేళ్ళ క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన నయీం కేరళలో చికిత్స చేయించుకున్నాడు. అక్కడకు అశోక్‌రెడ్డి పేరుతో వెళ్ళి వచ్చాడు. దీంతో నయీం ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేయడంతో తన బలాన్ని మరోసారి చూపించాలని భావించాడు. దీనికోసం ఎనిమిది నెలల క్రితం నగర శివార్లలో ఓ విందు ఏర్పాటు చేశాడు. దీనికి రౌడీషీటర్లు, మాజీ మావోయిస్టులతో పాటు అసాంఘికశక్తులు అంతా హాజరయ్యారు. ఈ విందు వేదికపైకి ఎక్కిన నయీం చుట్టూ ముగ్గురు యువతులు ఏకే–47 ఆయుధాలతో, మరో నలుగురు షార్ట్‌ వెపన్స్‌గా పిలిచే పిస్టల్స్‌తో కాపుకాశారు. ఈ విందుతో తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానంటూ అనుచరులకు సందేశం, ప్రత్యర్థులకు హెచ్చరికలు ఇచ్చాడు.

‘ఆలోచిస్తే’ అంతం చేసినట్లే...
నయీం ఓ వ్యక్తిని టార్గెట్‌గా ఎంచుకుని, హతమార్చాలని నిర్ణయించుకుంటే వారికి హెచ్చరికలు పంపిస్తాడు. నేరుగా ఫోన్లు చేసే నయీం ఒక్కోసారి ఒక్కో సెల్‌ఫోన్, సిమ్‌కార్డు వినియోగిస్తాడు. అల్కాపురి టౌన్‌షిప్‌లోని అతడి ఇంట్లో 258 సెల్‌ఫోన్లు, వందల సంఖ్యలో సిమ్‌కార్డులూ లభించడానికి ఇదే కారణమని పోలీసులు చెప్తున్నారు. నయీం ఎవరినైనా హతమార్చాలని నిర్ణయించుకున్నప్పుడు ‘ఆలోచన’ ప్రస్తావన తీసుకువస్తాడు. ‘నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావ్‌... నేను నీ గురించి ఆలోచించాల్సి వస్తుంది’ అంటే అవతలి వ్యక్తిని హత్య చేయడానికి నిర్ణయించుకున్నాడని అర్థమని పోలీసులు చెప్తున్నారు.

ఇవీ భూదందాలు..
బంజారాహిల్స్‌/మన్సూరాబాద్‌/గచ్చిబౌలి: పోలీస్‌ కాల్పుల్లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం సెటిల్‌మంట్‌ దందాలు సిటీలో భారీగానే జరిగాయి. సంపన్నులు నివసించే జూబ్లీహిల్స్, గచ్చిబౌలితో పాటు ఎల్‌బీనగర్‌లోని మన్సూరాబాద్‌లో వివిధ భూములకు సంబంధించిన జిరాక్స్‌ పత్రాలు నయీం ఇంట్లో లభించడంతో వాటిపై పోలీసులు విచారణ చేపట్టారు. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 44లోని ఫ్లాట్‌ నెంబర్‌ 827 ఇంటి డాక్యుమెంట్లు, మన్సూరాబాద్‌ రాక్‌హిల్స్‌కాలనీలోని సర్వే నెంబర్‌ 66/10/బీ,  శేరిలింగంపల్లి సర్వే నెంబర్‌ 87లో 9.37 ఎకరాల స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు లభించడంతో నయీం దందాలు సిటీలో బాగానే జరిగాయనే వెలుగులోకి వచ్చింది.

జూబ్లీహిల్స్‌ ప్లాట్‌ కథ ఇదీ...
జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 44లోని ఫ్లాట్‌ నెంబర్‌ 827 స్థలం 2005కు ముందు కొంత వివాదంలో ఉండగా సెటిల్‌మెంట్‌ భాధితులు నయీంను ఆశ్రయించి దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. 1982 సంవత్సరం ఏప్రిల్‌28వ తేదీన జూబ్లీహిల్స్‌ సొసైటీ  జి. లక్ష్మమ్మకు ఈ ప్లాట్‌  అలాట్‌ చేసింది. 1983 మే 2వ తేదీన లక్ష్మమ్మ ఈ ప్లాట్‌ను నిర్మలకు  విక్రయించగా, ఆమె దీన్ని 1983 మే 10వ తేదీన ఏవీ శ్రీనివాసరావుకు విక్రయించింది. అయితే  లక్ష్మమ్మ దత్త కుమారుడు పూడురు అశోక్‌కుమార్‌ ఆమెకు తెలియకుండా ఈ ప్లాట్‌ను రామరాజ్‌ సీతారామరావు అనే వ్యక్తికి జీపీఏ చేశాడు.

2005, డిసెంబర్‌ 28వ తేదీన నెల్లూరుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బి.శ్రీనివాసులురెడ్డి ఈ ప్లాట్‌ను ఏవీ శ్రీనివాసరావు నుండి కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేశారు.  ఆ సమయంలోనే జీపీఏ హోల్డర్‌ అంటూ రామరాజ్‌ సీతారామరావు ఇల్లు కట్టుకుంటున్న శ్రీనివాసులరెడ్డితో వివాదానికి దిగాడు. సీతారామరావు రిజిస్ట్రార్‌ ఆఫ్‌ ట్రిబ్యునల్‌ కోర్టును ఆశ్రయించాడు. గతేడాది డిసెంబర్‌ 28వ తేదీన ట్రిబ్యునల్‌ ఈ కేసును కొట్టివేసింది. అయితే  ఈ పాత డాక్యుమెంట్లు నయీం  వద్దకు ఎలా చేరాయన్న దానిపై  పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై  శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ...2005లో ఏవీ  శ్రీనివాసరావు దగ్గర నుంచి ఓపెన్‌ ప్లాట్‌  కొనుగోలు చేశాననితెలిపారు. ఆ డాక్యుమెంట్లు నయీం వద్దకు ఎలా చేరాయో తనకు తెలియదని పేర్కొన్నారు.

మన్సూరాబాద్‌లో...
నాగోలు డివిజన్‌ రాక్‌హిల్స్‌కాలనీలోని మన్సూరాబాద్‌ గ్రామ సర్వే నెంబర్‌ 66/10/బీ స్థలంలో ఆడిటోరియం నిర్మాణానికి సంబంధిత యజమానులు నిర్మాణం చేపడుతుండగానే  ఈ స్థలం మాదని నయీం మూఠా మనుషులు బెదిరించారు. ఏడాది క్రితం ఎల్‌బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌లో యజమానుల్లో ఒకరైన ఎస్‌.గిరిప్రసాద్‌రెడ్డి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అలాగే ఎన్‌టీఆర్‌నగర్‌లో సర్వే నెం–9/1/1ఏ స్థలంలో నయీం అనుచరులు వెయ్యి గజాల స్థలాన్ని కబ్జా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.  శేరిలింగంపల్లి సర్వే నెంబర 87లో 9.37 ఎకరాల స్థలం ఉన్నట్లు సైబరాబాద్‌ వెస్ట్‌ పోలీసులు నయీం నివాసం వద్ద లభించిన డాక్యుమెంట్లలో గుర్తించారు. అక్కడ చదరపు గజం స్థలం విలువ 25 వేలు ఉంటుంది. ఆ స్థలం విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. ఈ స్థలం వివరాలు తమకు తెలియవని రాజేంద్రనగర్‌ ఆర్‌డీఓ సురేష్‌ తెలిపారు.

అనుచరుల కోసం వేట
తుర్కయంజాల్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీం మృతితో వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసముండే ఆయన అనుచరుల ఇళ్లపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా భవానీ ఎన్‌క్లేవ్‌లోని ప్లాట్‌ నెం–49లో నివాసమున్న శ్రీధర్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని విచారణను ప్రారంభించినట్లు తెలుస్తోంది. శ్రీధర్‌గౌడ్‌ ఇచ్చిన సమాచారం మేరకు నయీం సన్నిహితులు, అనుచరుల కోసం వేటను మొదలుపెట్టినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం జాయింట్‌ సీపీ శశిధర్‌రెడ్డి, డీసీపీ తఫ్సీర్‌ఇక్బాల్, ఏసీపీలు వేణుగోపాల్‌రావు, భాస్కర్‌గౌడ్, సీఐలు మురళీకృష్ణ తదితరులు చర్చలు కొనసాగిస్తున్నారు. ఈ విచారణ ఒక్క రోజులో ముగిసేది కాదని ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్లి విచారణ చేపట్టనున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement