మాదకద్రవ్యాల దందాలోనూ నయీం?
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎన్–కంపెనీ’ ఏర్పాటు కోసం దుబాయ్‌కు మకాం మార్చాలని పథకం వేసిన గ్యాంగ్‌స్టర్ నయీం వీలైనంత త్వరలో ఎక్కువ డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగానే మాదకద్రవ్యాల దందాలోనూ అడుగుపెట్టినట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత శనివారం మహారాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ సెల్ (ఏఎన్‌సీ) అధికారులు కల్వా ప్రాంతంలో అరెస్టు చేసిన సర్దార్ వెల్లడించిన అంశాల ఆధారంగా ఈ కోణంలో దృష్టి పెట్టాడు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ‘భాయ్’ తనకు మాదక ద్రవ్యాలను ఇచ్చినట్లు అతను తెలిపారు. కాగా సర్దార్ మాజీ నక్సలైట్‌గా ఏఎన్‌సీ విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు మహారాష్ట్ర వెళ్ళి సర్దార్‌ను విచారించాలని భావిస్తున్నాయి.
ఏజెన్సీల్లోనూ మంచి పట్టు...
మహారాష్ట్ర ఏఎన్‌సీ అధికారులు సర్దార్‌ను గత 6న అదుపులోకి తీసుకుని రూ.22 లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అతను ఆయుర్వేద మందుల్ని నవీ ముంబైకు తరలించాలంటూ విశాఖపట్నంలో వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. అక్కడే ప్లాస్టిక్ బ్యాగ్స్‌లో కట్టిన 150 కేజీల గంజాయిని అందులో పెట్టుకుని బయలుదేరాడు. గతంలో మావోయిస్టు పార్టీలో, ఆపై సుదీర్ఘకాలం పోలీసు ఇన్‌ఫార్మర్‌గా పని చేసిన నయీంకు ఏపీలోని ఏజెన్సీ ప్రాంతంలోనూ మంచి పట్టుంది. అక్కడి ప్రస్తుత, మాజీ మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయి. వీటి ఆధారంగా గంజాయి సేకరిస్తూ అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో పక్క నయీంను అతడి అనుచరులు భాయ్‌సాబ్ అనే పిలుస్తుండటం, ఈ అక్రమ రవాణాలో ఓ మహిళ కీలకపాత్ర పోషిస్తోందంటూ సర్దార్ వెల్లడించాడు. నయీం నేర సామ్రాజ్యంలోనూ ఫర్హానా, అఫ్షా, సమీర పేర్లతో ఎందరో మహిళా డాన్లు ఉన్న విషయం విదితమే. గంజాయిని తెలంగాణలో డెలివరీ చేసేందుకు కేజీ రేటు రూ.2 వేలు, హైదరాబాద్‌లో రూ.5 వేలు, మహారాష్ట్రలోని షోలాపూర్‌లో రూ.8 వేలు, ముంబైలో డెలివరీ ఇవ్వడానికి రూ.20 వేలు, నవీ ముంబై వరకు తెస్తే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ‘భాయ్’ వసూలు చేస్తున్నట్లు ఏఎన్‌సీ విచారణలో సర్దార్ వెల్లడించాడు.
పండిస్తున్నదీ మాజీ మావోయిస్టు...
ఈ గంజాయిని విశాఖపట్నంలోని ఏజెన్సీ ప్రాంతంలో ఓ మాజీ మావోయిస్టు పండిస్తున్నట్లు సర్దార్ తెలిపాడు. ఓ రైతు నుంచి భూమిని లాక్కున్న సదరు మాజీ అందులో గంజాయి పండిస్తున్నాడని, ‘భాయ్’ ఆదేశాల మేరకు తాను విశాఖపట్నం నుంచి సరుకు తీసుకువచ్చి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు వెల్లడించాడు. తాను ‘భాయ్’ని ఎక్కువసార్లు చూడలేదని, ఫోన్లు, అతడి అనుచరుల ద్వారానే వ్యవహారం నడుస్తోందని తెలిపాడు. ఇదే తరుణంలో నయీం ఎన్‌కౌంటర్ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర పోలీసులు సర్దార్ వ్యవహరంపై కేంద్ర నిఘా వర్గాల ద్వారా రాష్ట్ర అధికారులకు సమాచారం ఇచ్చారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మాదకద్రవ్యాల దందాలో నయీం పాత్రపై ఆరా తీస్తున్నారు. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ ‘ప్రాథమికంగా అందిన సమాచారం, సర్కమ్‌స్టాన్షియల్ ఎవిడెన్స్ ప్రకారం ‘భాయ్’ నయీంగా భావిస్తున్నాం. అయితే అక్కడ పట్టుబడిన సర్దార్ మహారాష్ట్ర ముంబ్రాలోని అమృత్‌నగర్‌కు చెందినవాడు. కొంతకాలంగా డ్రగ్స్ దందాలోనే ఉండటంతో ఏఎన్‌సీ నిఘా ఉంచి పట్టుకుంది. జాతీయ స్థాయిలో నెట్‌వర్క్ ఉన్న నయీంకు సర్దార్‌తో పరిచయం ఏర్పడి ఉండే అవకాశాలు ఉన్నాయి. సర్దార్‌ను అన్ని కోణాల్లో విచారించిన తర్వాతే స్పష్టత వస్తుంది’ అన్నారు.