ఏరియాకో గ్యాంగ్ గల్లికో డెన్ | nayim illegal assets in all over city | Sakshi
Sakshi News home page

ఏరియాకో గ్యాంగ్ గల్లికో డెన్

Published Wed, Aug 10 2016 9:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

ఏరియాకో గ్యాంగ్ గల్లికో డెన్ - Sakshi

ఏరియాకో గ్యాంగ్ గల్లికో డెన్

సాక్షి, సిటీబ్యూరో: జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాలు...విసిరేసినట్లు ఉండే కాలనీలు...జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఏరియాలు... సిటీలోని ఇలాంటి వాటినే ఎంచుకున్న నయీం అక్కడి ఇండిపెండెంట్‌ ఇళ్లల్లో డెన్లు ఏర్పాటు చేసుకున్నాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం ఎన్‌కౌంటర్‌ అయిన తర్వాత తొలుత నార్సింగి ఠాణా పరిధిలోని అల్కాపూర్‌ టౌన్‌షిప్‌లో తొలి డెన్‌ వెలుగులోకి వచ్చింది. అప్పటి నుంచి పోలీసులు కూపీ లాగడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే గల్లీకో డెన్, ప్రాంతానికో గ్యాంగ్‌ బయటపడుతున్నాయి.

రెండేళ్ళ వరకు శంషాబాద్‌లో...
నయీం కేసుల్ని దర్యాప్తు చేస్తున్న పోలీసులు బుధవారం నగరంలోని శంషాబాద్, అల్కాపూర్‌లతో పాటు హస్తినాపురం, వనస్థలిపురం, మన్సూరాబాద్, కుంట్లూర్‌లోని ఇళ్ళపై దాడులు చేసి సోదాలు నిర్వహించారు. వీటిలో నయీంకు అల్కాపూర్‌లో ఉన్న ఇంటితో పాటు శంషాబాద్‌లో మరో ఇల్లు ఉన్నట్లు గుర్తించారు. అదే ప్రాంతంలో తన అనుచరుల కోసం ఇంకో ఇంటిని వినియోగిస్తున్నట్లు వెల్లడైంది. ప్రస్తుతం ఈ రెండూ ఖాళీగానే ఉన్నాయి.

నయీం రెండేళ్ళ క్రితం వరకు దాదాపు మూడేళ్ళ పాటు శంషాబాద్‌లోని సాతంరాయిలో ఉన్న ఇంట్లోనే నివసించాడు. ఈ ఇల్లు ప్రస్తుతం అల్కాపూర్‌లోని నయీం ఇంట్లో సోమవారం పోలీసులకు చిక్కిన ఫర్హానా పేరుతో ఉంది. ఈ డెన్‌ ఏర్పాటు చేసుకోవడానికి అప్పట్లో ఆ ప్రాంతంలో నివసించిన ఓ పోలీసు అధికారి సహకరించాడని తెలిసింది.

కబ్జా చేసి అనుచరులకూ నివాసాలు...
రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల్లోనూ దందాలు చేసిన నయీం మొత్తమ్మీద గడిచిన ఐదేళ్ళుగా నగరం చుట్టుపక్కలే నివసించాడు. ప్రతి సందర్భంలోనూ తన నివాసానికి సమీపంలోనే ముఖ్య అనుచరులకు షెల్టర్లు ఏర్పాటు చేసే వాడు. అలాగే వారికి ‘గిఫ్ట్‌’గా ఇచ్చిన ఫ్లాట్స్, ఇళ్ళల్లోనూ ఇతడు షెల్టర్‌ తీసుకునేవాడు. ఈ డెన్స్‌లో అత్యధికం కబ్జా పెట్టినవే అని పోలీసులు చెప్తున్నారు. శంషాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌ కాలనీలో కబ్జా చేసిన ఇంటిని అనుచరులకు అప్పగించాడు. వనస్థలిపురం, హస్తినాపురంతో పాటు మిగిలిన ప్రాంతాల్లోనూ ఇలాంటి డెన్స్‌ ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నయీం ఎన్‌కౌంటర్‌తో అనుచరులంతా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడంతో వీటిని గుర్తించడం కష్టసాధ్యంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.

అనువైన ప్రాంతాలనే ఎంచుకుని...
నయీం తనతో పాటు అనుచరులకూ డెన్స్‌ ఏర్పాటు చేసే విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. ఎవరి దృష్టీ పడని ప్రాంతాలనే ఎంచుకున్నాడు. ప్రధానంగా అనేక ప్రాంతాలు, వర్గాలకు చెందిన వారు నివసించే ఏరియాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. అలాంటి చోట్లలో ఏర్పాటు చేసుకుంటే ఇతరుల దృష్టి పడే అవకాశాలు తక్కువగా ఉంటాయనే ఉద్దేశంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు. ఈ డెన్స్‌లో అత్యధికం ఇండిపెండెంట్‌ హౌస్‌లు కావడం గమనార్హం. అలాగే పైకి కనిపించకుండా ప్రాంతాల వారీగా ముఠాలను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. స్థానికంగా సెటిల్‌మెంట్లు తదితరాలను వీరి ద్వారా చేయించేవాడు. ఈ డెన్స్‌ అన్నీ ఎస్కేప్‌ రూట్స్‌కు సమీపంలోనే ఉండేలా చూసుకున్నాడు.

మరోసారి ఫహీం ‘హంగామా’...
నల్గొండ జిల్లా చిట్యాల మండలం నాగారం వీఏఓ, నయీం సమీప బంధువు ఎం.ఎ.ఫహీం మరోసారి కలకలం సృష్టించాడు. కొన్నేళ్ళ క్రితం వనస్థలిపురం ప్రాంతం నుంచి అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. నల్లగొండ జిల్లా సంస్థాన్‌  నారాయణపూర్‌కు చెందిన ఫహీం భార్య షాజేదా, కూతురు, తల్లితో కలసి మన్సూరాబాద్‌ సహారా ఎస్టేటులో నివసిస్తున్నాడు. 2009లో సీబీఐ అధికారులు సొహ్రాబుద్దీన్‌ కేసులో ప్రశ్నించడానికి కోఠిలోని తమ కార్యాలయానికి పిలిపించారు.

నయీం సమాచారం ఇవ్వాలంటూ ఇతడిపై ఒత్తిడి సైతం తీసుకువచ్చారు. దీంతో ఫహీం అప్పట్లో హఠాత్తుగా కనిపించకుండా వెళ్లిపోయాడు. దీనిపై వనస్థలిపురం ఠాణాలో కేసు నమోదు కావడంతో పాటు తీవ్ర కలకలం రేగింది. అప్పట్లో నయీమే ఫహీంను తీసుకువెళ్ళి, వదిలినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత ఫహీం సైతం ఓ గ్యాంగ్‌ నిర్వహించినట్లు తేలడంతో ఇతడి కోసం పోలీసులు ముమ్మరంగా గాలింపు చేపట్టారు. బుధవారం ఇతడి ఇంటిపై దాడి చేసి సోదాలు చేశారు.

సిటీ నుంచి ముగ్గురు ‘సిట్టింగ్‌’...
తెహరీఖ్‌ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టిన ఉగ్రవాది విఖార్‌ అహ్మద్‌ తన అనుచరులతో సహా గత ఏడాది ఏప్రిల్‌లో నల్లగొండ జిల్లా ఆలేరు వద్ద ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. వరంగల్‌ జైలు నుంచి నగరంలోని కోర్టుకు తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌)లో సిటీకి చెందిన ఇన్‌స్పెక్టర్లు ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు నయీం కార్యకలాపాలు, కేసుల దర్యాప్తు కోసం ఏర్పాటు చేసి సిట్‌లో ముగ్గురికి చోటు దక్కింది. మొత్తం ఎనిమిది మంది సభ్యుల్లో సైబరాబాద్‌ అదనపు డీసీపీ (క్రైమ్స్‌) శ్రీనివాస్‌రెడ్డి, బేగంబజార్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్, ఉప్పల్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement